లక్షా 50 వేల కోట్ల భూములను రక్షించాం...ఆర్టికల్ 21, 48ఏను ఫాలో అయ్యాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

లక్షా 50 వేల కోట్ల భూములను రక్షించాం...ఆర్టికల్ 21, 48ఏను ఫాలో అయ్యాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
  •     బడా బాబులు ఆక్రమించిన చెరువులు, పార్కులు కాపాడాం 
  •     నిజాయితీ, నిబద్ధతే హైడ్రా ధైర్యమని వెల్లడి 
  •     కోర్టులను ల్యాండ్ మాఫియా తప్పుదోవ పట్టిస్తున్నదని ఆవేదన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండేండ్లలో హైడ్రా కమిషనర్​గా రాజ్యాంగ స్ఫూర్తిననుసరించి..ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించామని, మార్కెట్​లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధరించామని, మరో 20 చెరువుల పున‌రుద్ధరణ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా కేవలం రెండేండ్లలో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తామని, అవే హైడ్రాకు ధైర్యమని తెలిపారు.  ల్యాండ్ మాఫియా, భూ కబ్జా దారులు కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.  

లోతుకుంట విషయంలో జరిగింది ఇదే..

లోతుకుంట విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని, పర్మిషన్స్ లేకుండా 2500 కోట్ల ఏండ్ల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమ‌తులు లేకుండా విచ్చల విడిగా ధ్వంసం చేసిందని  రంగనాథ్  అన్నారు. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లయింట్​పై హైడ్రా రంగంలోకి దిగిందన్నారు. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉండాల్సిన భూమిని చూపిస్తూ, సదరు బిల్డర్​120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి తన మీద కంటెంప్ట్ కేసు వేశారన్నారు. తన మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని, వాటిని వేసింది బడా భూకబ్జాదారులేనని  రంగనాథ్  వివరించారు.  

అదే నేను చేసిన తప్పా 

‘బతుకమ్మ కుంటను మింగేయాలని చూసిన ఒక వ్యక్తి, లోతుకుంటలో వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్ ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం, ఇలా అన్యా యాలు చేస్తున్న అనేక మంది వ్యక్తులకు హైడ్రా కమిషనర్​గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పా’ అని రంగనాథ్​ అన్నారు. 

వీళ్లంతా వేసి నవే 63 కోర్టు ధిక్కార కేసులన్నారు. వాటిని తాను చట్ట పరంగానే ఎదుర్కొంటానని, తనకు న్యాయస్థానాలంటే పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వాలు తనకు గతంలో, ఇప్పుడు, ఎప్పుడూ  ఏ బాధ్యతలు అప్పగించినా తన వైపు నుంచి 100శాతం ఫ‌లితాలు ఇవ్వటానికి పని చేస్తానని  రంగనాథ్  పేర్కొన్నారు.