- 8 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్‌లో హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల కబందహస్తాల్లో ఉన్న సుమారు రూ.1,200 కోట్ల విలువైన 8 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని రక్షించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్– 55లోని ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఖానామెట్ సర్వే నంబర్– 55లోని అసైన్డ్ భూమిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రోహిబిటెడ్ (నిషేధిత) జాబితాలో చేర్చారు. అయితే, ఈ భూమి తమదేనని మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ వాదిస్తుండగా, వాసవి నిర్మాణ సంస్థ ఆ భూమిలో ఆర్‌సీసీ ప్లాంట్లు, కార్మికుల షెడ్లు నిర్మించి, నిర్మాణ సామగ్రిని నిల్వ చేస్తూ సుమారు 4.20 ఎకరాలను ఆక్రమించింది.
మరోవైపు, ఇదే సర్వే నంబర్‌లోని మరో 4 ఎకరాల భూమిని కొలను మాధవరెడ్డి కుమార్తె కొలను సబిత తనదిగా పేర్కొంటూ, ఎవరూ రాకుండా బౌన్సర్లను కాపలాగా పెట్టారు. ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. రెవెన్యూ, సంబంధిత శాఖల సమన్వయంతో అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. అనంతరం మంగళవారం భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. షెడ్లను కూల్చివేసి, భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, అది ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను పాతారు.
