హైడ్రా వల్లే ముంపు నుంచి విముక్తి..ఆక్రమణదారుల ఆటలు సాగకనే అతస్య ప్రచారం

హైడ్రా వల్లే ముంపు నుంచి విముక్తి..ఆక్రమణదారుల ఆటలు సాగకనే అతస్య ప్రచారం
  •     హైడ్రాకు మద్దతుగా సంక్షేమ సంఘాల ర్యాలీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రాకు మద్దతుగా ఆదివారం అమీర్‌‌పేట్, మధురానగర్, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో పలు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. శ్రీనివాసనగర్ వెస్ట్, వెంగల్‌‌రావు నగర్, మధురానగర్, మోతీనగర్, రాజీవ్‌‌నగర్, సిద్ధార్థనగర్, జయప్రకాశ్ నగర్, ఇంజినీర్స్ కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. హైడ్రా ఏర్పాటైన రెండేళ్లలోనే సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. 

రెండు విడతల్లో 20 చెరువులను పునరుద్ధరించి నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడిందని కొనియాడారు. గతంలో స్వల్ప వర్షానికే అమీర్‌‌పేట్, పరిసర కాలనీలు జలమయమయ్యేవని, మెట్రో స్టేషన్ కింద పూడిపోయిన పైప్‌‌లైన్లను గుర్తించి వారంలోనే ఆరు లేన్లను పునరుద్ధరించిందని తెలిపారు. అలాగే ప్యాట్నీ నాలా విస్తరణతో వరద సమస్యను నివారించిందన్నారు. హైడ్రా చర్యలతో ఆక్రమణదారుల ఆటలు సాగకపోవడంతో, వారికి మద్దతు ఇచ్చే కొందరు నాయకులు సంస్థపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.