హైదరాబాద్ లోని నార్సింగిలో ముష్కిన్ చెరువు కబ్జాలకు చెక్ చెప్పింది హైడ్రా. రూ. 5వేల 500 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు హైడ్రా అధికారులు. HMDA లెక్కల పకారం 52.20 ఎకరాలు ఉన్న చెరువును మధ్యలో నుంచి కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం చేశారు కబ్జాదారులు. చెరువు అభివృద్ధి పేరుతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో రంగంలోకి దిగింది హైడ్రా.
CSR నిధులతో చెరువు అభివృద్ధి పనులు చేపట్టింది తత్వ నిర్మాణ సంస్థ. ఈ క్రమంలో మొత్తం 52.20 ఎకరాల చెరువును కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. కబ్జాకు చెక్ చెబుతూ మొత్తం చెరువుకు ఫెన్సింగ్ వేశారు హైడ్రా అధికారులు. చెరువు FTL పరిధిలో 52.20 ఎకరాలు ఉండగా... ఇందులో ప్రభుత్వ శిఖం 20.23 ఎకరాలు కాగా... మిగతా అంత ఎక్సాల్ పట్టా ల్యాండ్ అని తెలిపారు అధికారులు.
అక్కడ ఎలాంటి నిర్మాణ యాక్టివిటీస్ చేపట్టరాదనే నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు అధికారులు. పేదల పేరిట గుడిసెలు వేసి కొట్టేయాలని రియల్టర్లు ప్రయత్నించారని తెలిపారు అధికారులు. రెండు నెలల క్రితం గుడిసెలు ఖాళీ చేయించాలని తగినంత సమయం ఇచ్చామని... గుడిసెల్లో ఉండేవారు స్వచ్చందంగా ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిపారు అధికారులు. ఇవాళ ఉదయం చెరువు ఎఫ్టీఎల్ హద్దులు నిర్దారించి ఫెన్సింగ్ వేసినట్లు తెలిపారు.
