వరల్డ్ కప్ 2019 మెగా టోర్నమెంట్ లో భాగంగా ఇండియా- వెస్టిండీస్ మధ్య లీగ్ మ్యాచ్ గురువారం జరగబోతోంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు. హార్డ్ హిట్టర్లు, ఆల్ రౌండర్ల జట్టుగా పేరున్న వెస్టిండీస్ .. టోర్నమెంట్ లో మెరుపులు మెరిపిస్తున్నా పాయింట్ల వేటలో మాత్రం వెనకడుగు వేస్తోంది. ఇటీవలే న్యూజీలాండ్ తో మ్యాచ్ లో విండీస్ బ్యాట్స్ మన్ బ్రాత్ వైట్ .. సుదీర్ఘకాలం గుర్తుండే ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. వెస్టిండీస్ ఓడుతున్నా.. ఆ మ్యాచ్ పై ఆసక్తి కనిపిస్తోంది. వెస్టిండీస్ 6 మ్యాచ్ లలో ఒకటి మాత్రమే గెలిచింది. ఓటమెరుగని ఇండియా ఆడిన ఐదింట్లో 4 మ్యాచ్ లు నెగ్గింది.
సెమీస్ చేరాలంటే అన్ని మ్యాచ్ లను గెలవాల్సిన పరిస్థితుల్లో కీలకమైన మ్యాచ్ కు వెస్టిండీస్ సిద్ధమైంది. ఆ జట్టు ప్రాక్టీస్, వ్యూహాలపై క్రిస్ గేల్ మీడియాతో మాట్లాడారు. ‘నెక్స్ట్ రౌండ్ కు వెళ్లడానికి తమకు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయన్న సంగతి మాకు తెలుసు. మెగా టోర్నీల్లో ఏదైనా జరగొచ్చు. ఇండియాతో మ్యాచ్ మాకు ఛాలెంజ్ లాంటిది. విరాట్ కోహ్లీ టీమ్ మంచి క్రికెట్ ఆడుతోంది. ఈ మ్యాచ్ కోసమే నేను ఎదురుచూస్తున్నా’ అని క్రిస్ గేల్ చెప్పాడు.

