మన మిసైల్ మన హెలికాప్టర్​ నే కూల్చేసింది

మన మిసైల్ మన హెలికాప్టర్​ నే  కూల్చేసింది

ఫిబ్రవరి 27 న దాయాది పాకిస్థాన్​తో సరిహద్దు టెన్షన్​లు ఎక్కువైన రోజు. శత్రు దేశ విమానాలు మన దేశంలోకి చొరబడి బాంబులేసిన రోజు. మన యుద్ధ విమానాలు వాటిని వెంబడించి తరిమి తరిమి కొట్టే పనిలో పడ్డాయి. ఆ డాగ్​ఫైట్​ అలా జరుగుతుండగానే బుద్గాంలో మన హెలికాప్టర్​ ఎంఐ 17 కుప్పకూలిపోయింది. ఆరుగురు వైమానిక దళ సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. పాకిస్థానే కూల్చేసిందని ముందుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత సాంకేతిక సమస్యలతో కూలిపోయిందని వివరణ వచ్చింది. కానీ, ఆ హెలికాప్టర్​ కూలిపోవడానికి అవేవీ కారణాలు కాదు. ఎవరూ ఊహించనిది, అనుకోనిది జరిగింది. శత్రువు అనుకుని మనం విసిరిన మిసైలే మన హెలికాప్టర్​ను కూల్చేసింది. కేవలం 12 క్షణాల్లోనే దాన్ని నేలమట్టం చేసింది. అవును, పొరపాటునే జరిగినా అదే నిజమని భారత వైమానిక దళం (ఐఏఎఫ్​) విచారణలో తేలిందట. మరో 20 రోజుల్లో ఆ ఘటనకు సంబంధించిన నివేదికను ఐఏఎఫ్​ సమర్పించనుందట. ఓ ఆంగ్ల పత్రికకు ఐఏఎఫ్​ వర్గాలు ఆ నివేదికకు సంబంధించిన వివరాలను వెల్లడించాయి. పొరపాటునే జరిగినా ఏడుగురి చావుకు కారణమైన వారిపై వైమానిక దళ చట్టం 1950 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారట.

ఆ రోజు అసలేమైంది?

పాక్​ యుద్ధ విమానాలు దేశంలోకి చొరబడి కొన్ని చోట్ల బాంబులు విసిరాయి. దీంతో ఎయిర్​బేస్​లు సహా కాశ్మీర్​ మొత్తం అలర్ట్​ అయింది. శ్రీనగర్​ ఎయిర్​బేస్​ కూడా సదా సిద్ధం అన్నట్టుగా అప్రమత్తమైంది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఇజ్రాయెల్​నుంచి కొన్న ‘స్పైడర్​’ క్షిపణులను సిద్ధం చేసుకుంది. శత్రువొచ్చిందే ఆలస్యం, వేసెయ్యాలని డిసైడ్​ అయ్యింది. కానీ, అదే టైంలో మన హెలికాప్టర్​ ఎంఐ 17 గాల్లో ఉందన్న విషయం ఆ ఎయిర్​బేస్​లో ఉన్నోళ్లకెవరికీ తెలియదు. మన మిసైల్​కే బలైపోతామని ఆ హెలికాప్టర్​లో ఉన్నోళ్లూ ఊహించలేదు. తక్కువ ఎత్తులో ఏదో హెలికాప్టర్​ ఎగురుతున్నట్టు శ్రీనగర్​ ఎయిర్​పోర్టుకు రాడార్ల ద్వారా తెలిసింది. అది శత్రువుకు చెందిన హెలికాప్టరేనని భావించిన టెర్మినల్​ వెపన్స్​ డైరెక్టర్​ (టీడబ్ల్యూడీ– ఆ టైంలో ఆయనే ఎయిర్​బేస్​ చీఫ్​ ఆపరేషన్స్​ ఆఫీసర్​గా ఉన్నారు) ఫైరింగ్​కు ఆర్డర్లిచ్చేశారట. దీంతో స్పైడర్​ మెరుపువేగంతో (మాక్​4, ధ్వనికి నాలుగు రెట్ల వేగం) దూసుకెళ్లి 12 సెకన్లలో హెలికాప్టర్​ను కూల్చేసి ఏడుగురిని బలి చేసింది.

అదేం లేదు.. ఐఏఎఫ్​ అధికారుల వివరణ

ఎంఐ 17ను షూట్​ చేసిన వీడియో ఆధారంగా కోర్ట్​ ఆఫ్​ ఎంక్వైరీకి ఆదేశించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఐఏఎఫ్​ అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్​ను మిసైల్​ ఢీకొట్టినట్టు వీడియోలో స్పష్టమవుతోందని కొందరు అధికారులు చెప్పిన మాటలను కొట్టిపారేశారు. నిజానికి ఎయిర్​బేస్​ నుంచి హెలికాప్టర్​ ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉందని, అంత దూరంలో ఉన్నప్పుడు కెమెరాతో జూమ్​ చేసి చూపించడమన్నది అసాధ్యమని చెప్పారు.