వరుణ్ మృత్యువును జయిస్తడు: తండ్రి కేపీ సింగ్

వరుణ్ మృత్యువును జయిస్తడు:  తండ్రి కేపీ సింగ్

ఆర్మీ హెలికాప్టర్‌‌ ప్రమాదంలో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కడు.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ మృత్యువుతో పోరాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు బెంగళూరులోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) ఇవాళ సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. వరుణ్ సింగ్ కండిషన్ ఇంకా విషమంగానే ఉందని, అయితే పరిస్థితి స్టేబుల్‌గానే ఉందని పేర్కొంది. 

కాగా, వరుణ్ సింగ్ తండ్రి, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కేపీ సింగ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి బెస్ట్ డాక్టర్స్ టీమ్ మంచి వైద్యం అందిస్తున్నారని చెప్పారు. దేశం మొత్తం తన వరుణ్ బతకాలని దేవుడిని ప్రార్థిస్తోందని, తన కుమారుడు ఎవరో తెలియని సామాన్యులు, మహిళలు సైతం వచ్చి తనను కలిసి ధైర్యం చెబుతున్నారని అన్నారు. వాళ్లంతా వరుణ్‌పై చూపిస్తున్న ప్రేమను చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని కేపీ సింగ్ చెప్పారు. తన కొడుకు ఓ యోధుడని, మృత్యువును గెలిచి బయటికొస్తాడని ఆయన అన్నారు.

డిసెంబర్ 8న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు హెలికాప్టర్‌‌లో ప్రయాణిస్తుండగా తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించగా.. ఒక్క వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను వెల్లింగ్టన్‌లోని ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రెండ్రోజుల క్రితం బెంగళూరులోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ డాక్టర్ల టీమ్‌ ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తోంది.