న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్‌తోనే ఉన్నానని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌పైలెట్ అన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అధిష్టానం దృష్టిలో తనను తక్కువ చేసేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను బీజేపీలో చేరుతున్నాను అనే దాంట్లో నిజం లేదు. హైకమాండ్ దగ్గర నన్ను తక్కువ చేసేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. నేను ఇప్పటికీ కాంగ్రెలో మెంబర్‌నే” అని సచిన్‌పైలెట్ చెప్పారు. రాజస్థాన్ ప్రజలకు సేవ చేయడమే తన ఉద్దేశం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అశోక్‌గెహ్లాట్, ఆయన గ్యాంగ్ తనను టార్గెట్ చేశారని, అప్పటి నుంచి నా ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను అని పైలెట్ ఒక మీడియా సంస్థతో చెప్పారు. నన్ను, నా అనుచరులను ఏ కార్యక్రమానికి పిలిచేవారు కాదు, భాగస్వామ్యం కానిచ్చేవారు కాదు అని అన్నారు. రాష్ట్రంలో తనకు సముచిత స్థానం లేదంటూ సచిన్‌పైలెట్ సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను ఒక హోటల్‌లో ఉంచారు. రెండుసార్లు సీఎల్పీ సమావేశం నిర్వహించినప్పటికీ హాజరు కాలేదు. దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. సచిన్‌పైలెట్‌ను ఉపముఖ్యంత్రి పదవి నుంచి, ఆయనకు మద్దతుగా ఉన్న ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

