మహిళా క్రికెట్ వరల్డ్ కప్ 2022ను ICC విడుదల చేసింది.న్యూజిలాండ్ వేదికగా మార్చి 4 నుంచి ఏప్రిల్ వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించనున్నారు. భారత జట్టు మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. మార్చి 6న మిథాలీ సేన తౌరంగలోని బే ఓవల్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరుగనున్నట్లు ICC తెలిపింది. భారత మహిళా జట్టు 2017 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మహిళా వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్‌ను 2022కు ఐసీసీ వాయిదా వేసింది. గ్రూప్ దశలో భారత జట్టు పాక్ తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో తలపడాల్సి ఉన్నది. టీమ్ ఇండియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న మిథాలీ రాజ్‌కు కూడా ఇదే చివరి టోర్నీ కానునందున ఎలాగైనా వరల్డ్ కప్ గెలిచి తీరాలని భావిస్తున్నారు.
ICC తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు వెస్టిండీస్‌తో మార్చి 4న తలపడనుంది. ఈ మ్యాచ్ బే ఓవల్‌లో జరుగనున్నది. 31 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, క్రైస్ట్ చర్చ్, డునేడిన్, హామిల్టన్, తౌరంగా, వెల్లింగ్టన్ వేదికలను సిద్దం చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా. ఇండియా జట్లు 2017-20 ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్ ద్వారా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశంగా న్యూజిలాండ్ ఆటోమెటిగ్గా అర్హత సాధించింది. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్ ద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ అర్హత సాధించాయి. ఈ వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న అన్ని జట్లు ఒక్కో సారి ప్రత్యర్థి జట్టుతో తలపడనున్నాయి. ఆఖర్లో నాలుగు జట్లు సెమీఫైనల్‌కు క్వాలిఫై కి అర్హత పొందుతాయని తెలిపింది ఐసీసీ.

