- నేడు కివీస్‑విండీస్ మధ్య తొలి పోరు
మౌంట్‌మాంగనీ: అమ్మాయిల క్రికెట్‌లో అత్యుత్తమ జట్టు ఎవరో తేల్చే వన్డే వరల్డ్ కప్‌నకు రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్ వేదికగా ఈ మెగా టోర్నీ శుక్రవారం మొదలవుతోంది. ఇందులో 8 జట్లు పోటీ పడుతున్నాయి. 2017లో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని టీమిండియా తొలి కప్ కోసం బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఆరుసార్లు కప్పు గెలిచిన ఆస్ట్రేలియా ఏడో టైటిల్‌పై గురిపెట్టింది. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, ఆతిథ్య న్యూజిలాండ్ కూడా ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. బంగ్లాదేశ్ తొలిసారి వరల్డ్‌కప్‌లో పోటీ పడుతోంది. రౌండ్ రాబిన్ దశలో ప్రతీ జట్టు మిగతా టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అవుతాయి. రౌండ్ రాబిన్ దశలో మ్యాచ్‌లు టై అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు టై అయితే మాత్రం విజేత తేలే వరకూ సూపర్ ఓవర్లు ఆడిస్తారు.

