‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా రివ్యూ

‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా రివ్యూ

తెలుగు తెరపై దేవదాసు నుంచి నిన్న మొన్నటి అర్జున్ రెడ్డి దాకా ఎన్నో  ప్రేమ కథలు వచ్చాయి. అయితే వాటిల్లో వైవిధ్యమైన సినిమాలు నిలబడ్డాయి. లేనివి.. కాల పరీక్షకు నిలబడలేకపోయాయి. ముఖ్యంగా మారుతున్న కాలంలో ఈ జనరేషన్‌కు నచ్చేలా , వారి అభిరుచులు ప్రతిబింబిస్తూ తీయటం మాత్రం చాలా కష్టంగా మారింది. ఈ నేఫధ్యంలో దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత నుంచి ఓ ప్రేమ కథ వస్తుందంటే ఖచ్చితంగా అందరికీ ఆసక్తికరమే. టర్కీ చిత్రం రీమేక్ గా వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ..

మహి (రాజ్‌ తరుణ్‌), వర్ష (షాలిని పాండే) చిన్ననాటి స్నేహితులు. ఒకరికొకరు ప్రాణంగా పెరుగుతారు. అయితే ఎనిమిదేళ్ల వయసులో ఇద్దరూ విడిపోవాల్సివస్తుంది. దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత వాళ్లిద్దరిని విధి కలుపుతుంది. మహి అప్పటికి ఓ ఫొటో గ్రాఫర్ గా ఎదిగి.. ఫొటో స్టూడియోను రన్ చేస్తూంటాడు. వర్ష.. ఓ నటిగా ఎదుగుదామని ప్రయత్నాలు చేస్తూంటుంది. మహి ఏర్పాటు చేసిన ఓ ఫొటో ఎగ్జిబిషన్‌లో వీళ్లిద్దరూ కలుస్తారు. అప్పటికే ఆమెకు రాహుల్ (రాజా)తో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిన మహికి హెల్త్ పరంగా ఓ సమస్య ఉంటుంది. దాంతో తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు. కానీ విధికి వీళ్లద్దరిని కలపాలని ఉంటుంది. ఏ విధంగా వీరిద్దరిని ఒకటి చేసింది. మహికి ఉన్న హెల్త్ సమస్య ఏమిటి.. వర్ష నటిగా ఎదిగిందా.. రాహుల్ ఏమయ్యాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

కొన్ని సినిమాలు కళ్లతో చూడాలి.. మరికొన్ని మైండ్‌తో చూడాలి. ఇంకొన్ని మనసుతో చూడాలి. ఇది మూడో టైప్ సినిమా. గ్లామర్, కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి.. హృదయానికి హత్తుకునే పాయింట్ తో తెరకెక్కిందీ చిత్రం. స్టోరీ లైన్‌ మనకు గీతాంజలిని గుర్తు చేసినా ఆ ఛాయలు సినిమాలో కనపడవు. అయితే రెగ్యులర్‌గా ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ కనపడకపోవటంతో దానికి అలవాటు పడిన వాళ్లకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, టోటల్‌గా సినిమాని.. సినిమాగా చూస్తే మాత్రం ఓ ఫీల్ గుడ్ ఫిల్మ్ చూసిన అనుభూతి వస్తుంది. అయితే స్లో నేరేషన్‌తో నడవటంతో ప్రేక్షకుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. కథ ముందుకు, వెనక్కి వెళ్లటం కొత్తగా అనిపించినా.. రెగ్యులర్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవడం కష్టమే. స్క్రిప్టు పరంగా మరింత వేగంగా ఉంటే బాగుండేది. దర్శకుడుగా జీఆర్ కృష్ణ సబ్జెక్టుకి తనవంతు న్యాయం  చేశాడు. ఆహ్లాదం కలిగించే విజువల్స్‌తో సినిమాని నడిపించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ ఏమీ కలపలేదు. మోటు కామెడీ, ఐటం సాంగ్స్ వంటి వాటికి చోటు ఇవ్వకపోవటం దర్శకుడు నిబద్దతకు నిదర్శనం. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత సినిమా కావటంతో ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్‌లో మరింత స్పీడుగా ఉంటే బావుండేది.

మైనస్‌లు…

  • సినిమా చాలా చోట్ల సాగినట్లు మెల్లిగా నడవటం
  • హీరో సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో సినిమా మొత్తం లాగించేయటం
  • రాజ్ తరుణ్‌లో బొత్తిగా హుషారు లేకపోవడం.
  • సెకండాఫ్‌లో పెద్దగా మలుపులు లేకపోవటం

ప్లస్‌లు..

  • సినిమాటోగ్రఫీ
  • మ్యూజిక్
  • షాలినీ పాండే నటన
  • క్లైమాక్స్
  • టెక్నికల్‌గా మంచి వ్యాల్యూస్‌

టూకీగా: ప్యూర్ లవ్ స్టోరీ చూడాలనుకునేవాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్. కమర్షియల్ ఎలిమెంట్స్, బీబత్సమైన మలుపు, కామెడీ కావాలనుకునేవాళ్లు ఎవాయిడ్ చేయటమే బెస్ట్.

నటీనటులు:  రాజ్ తరుణ్, షాలిని పాండే, రాజా, నాజర్,  భరత్ తదితరులు

సంగీతం:  మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్: సమీర్ రెడ్డి

ఎడిటర్: తమ్మిరాజు

దర్శకత్వం: జి ఆర్ కృష్ణ

నిర్మాత‌లు: దిల్ రాజు, శిరీష్