న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు వారం తిరగకముందే రెండోసారి పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద సిటీ గ్యాస్ సంస్థ అయిన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్), ఆదివారం నుంచి కిలో సీఎన్‌జీ ధరను రూ.1 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80.09 కి చేరింది. గత గురువారమే ఐజీఎల్ కిలోపై రూ.2 పెంచింది. అయితే, ఇళ్లకు సరఫరా చేసే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో కేజీ సీఎన్‌జీ ధర రూ.97 దగ్గర ఉంది.
- ఇన్‌పుట్ గ్యాస్ ధరలు పెరగడంతో..
దిగుమతి చేసుకుంటున్న ఇన్‌పుట్ గ్యాస్ ధరలు పెరగడంతో సీఎన్‌జీ రేట్లు పెంచామని ఐజీఎల్ పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడడంతో దిగుమతులు కాస్ట్లీగా మారాయని, దీంతో ఆర్థిక భారాన్ని కొంతవరకు సర్దుబాటు చేసుకోవడానికే ఈ స్వల్ప ధరల పెంపును చేపట్టినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త ధరలు ఆదివారం నుంచి ఐజీఎల్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో అమలులోకి వచ్చాయి. అయితే, పెట్రోల్, డీజిల్ బండ్లతో పోలిస్తే సీఎన్‌జీ వాహనాల నిర్వహణ ఖర్చు ఇంకా 45 శాతం వరకు తక్కువగా ఉందని కంపెనీ పేర్కొంది.
