ఇగ్నైట్ పేరుతో సామాన్యులకు టోకరా..రూ. 600 బ్రష్‌‌ను రూ. 60 వేలకు సేల్

ఇగ్నైట్ పేరుతో సామాన్యులకు టోకరా..రూ. 600 బ్రష్‌‌ను రూ. 60 వేలకు సేల్
  • కమీషన్ల పేరుతో పెట్టుబడిదారుల జేబులకూ చిల్లు
  • నాలుగు రాష్ట్రాల్లో సోదాలు.. ఆరుగురు అరెస్ట్
  • గతంలో క్యూనెట్ పేరుతో మోసాలకు పాల్పడిన ఇదే సంస్థ

హైదరాబాద్‌‌, వెలుగు: గతంలో క్యూనెట్ పేరుతో మోసాలకు పాల్పడిన సంస్థ..మళ్లీ ఇప్పుడు 'ఇగ్నైట్' పేరుతో కొత్తగా మల్టీ-లెవల్ మార్కెటింగ్ మోసానికి తెరతీసింది. ఆన్‌‌లైన్‌‌లో వస్తువులను అమ్ముతామని నమ్మిస్తూ సామాన్యులను బురిడీ కొట్టిస్తోంది.పెట్టుబడికి రెట్టింపు ఆశ చూపి కమీషన్ల పేరుతో జేబులకు చిల్లు పెడుతోంది. హాంకాంగ్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో 'సిమెట్రా' పెన్నులు, గాజు ముక్కలు వంటి నిరుపయోగమైన వస్తువులను భారీ ధరలకు అమ్ముతున్నారు.

ముఖ్యంగా రూ. 600 కూడా విలువ చేయని టూత్ బ్రష్‌‌ను రూ. 60,000కు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. బ్రెయినిఫై అనే ఏఐ లెర్నింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌ను కూడా విక్రయిస్తున్నట్లు వాట్సాప్, ఫేస్‌‌బుక్ సహా పలు సోషల్ మీడియా వేదికల ద్వారా ఇగ్నైట్ మల్టీ-లెవల్ మార్కెటింగ్ సంస్థ ప్రచారం చేస్తోంది. ఈ సంస్థ చేస్తున్న మోసాలను గుర్తించిన హైదరాబాద్ సిటీ పోలీసులు.. కేవలం 18 రోజుల్లోనే ముఠా గుట్టు రట్టు చేశారు.

ఆరుగురిని అరెస్ట్ చేసి.. దేశవ్యాప్తంగా జరగబోయే సుమారు రూ. 5,000 కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్‌‌లోని కమాండ్‌‌ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌లో నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ గురువారం మీడియాకు వెల్లడించారు. 

మోసం ఎలా బయటపడిందంటే..!

ప్రమోషన్స్‌‌తో పాటు అధిక లాభాలకు ఆశపడిన హైదరాబాద్‌‌కు చెందిన ముగ్గురు బాధితులు ఈ మోసపూరిత సంస్థలో రూ. 1.87 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ డబ్బు వెనక్కి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఇగ్నైట్  పేరుతో క్యూనెట్ సంస్థ నిర్వాహకులు చేసిన స్కామ్ బయటపడింది. పెట్టుబడి తిరిగి రావాలంటే కొత్త సభ్యులను చేర్పించాలని నిబంధన విధించి, బాధితులను నిందితులు నమ్మించి మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో ఢిల్లీ, యూపీ, వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఒనియల్ గుప్తా, దినేష్ కుమార్, ప్రియాన్షు సక్సేనా, ప్రవీణ్ కుమార్ దకాలియా, పరితోష్ కుమార్ దకాలియా, రియాజ్ అనే ఆరుగురు కీలక నిందితులను అరెస్టు చేశారు. బాధితుల సొమ్ము కోల్‌‌కతాలోని ఒక ప్రైవేట్ ఖాతాకు మళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అధిక లాభాల పేరుతో వచ్చే ఇటువంటి ఆన్‌‌లైన్ పథకాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.