పెద్ద పేగు (కోలన్) కేన్సర్ కు బ్యాక్టీరియాతో ట్రీట్ మెంటా..? విచిత్రంగా ఉందే.. ? అనుకుంటున్నారా! అవును. పెద్ద పేగు కేన్సర్ కు ‘ప్రో బయోటిక్ థెరపీ’ అనే ఓ వినూత్న ట్రీట్ మెంట్ మరికొన్నేండ్లలో అందుబాటులోకి రానుంది. తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) స్టూడెంట్స్ దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. పెద్ద పేగుకు కేన్సర్ వస్తే ఆ మేరకు పేగును కట్ చేయాల్సిందే. కేన్సర్ తీవ్రమైనా, ఇతర భాగాలకు వ్యాపించినా.. ప్రాణాలు దక్కడం చాలా కష్టం. అయితే, కోలన్ కేన్సర్ కు ప్రో బయోటిక్ థెరపీతో సమర్థంగా ట్రీట్ మెంట్ చేయొచ్చని ఐఐఎస్ఈఆర్ స్టూడెంట్స్ అంటున్నారు. ఈ దిశగా తాము ప్రాథమిక పరిశోధనలను విజయవంతంగా ముగించామని వారు వెల్లడించారు. ఇటీవల అమెరికాలోని బోస్టన్ లో జరిగిన ఇంటర్నేషనల్ జనెటికల్లీ ఇంజనీర్డ్ మెషీన్ (ఐజెమ్) గ్లోబల్ కాంపిటీషన్ లో తమ పరిశోధనకు గోల్డ్ మెడల్ లభించినట్లు వారు తెలిపారు.
ప్రో– బయోటిక్ థెరపీ అంటే..?
సాధారణంగా మన పేగుల్లో కోట్లాది బ్యాక్టీరియాలు ఉంటాయి. చాలావరకూ అవన్నీ మనకు మంచి చేస్తూ.. మనం అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంటాయి కూడా. అందుకే పేగుల్లో ఆ బ్యాక్టీరియాలు తగ్గిపోయినప్పుడు కూడా మనకు పేగుల సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం మంచి బ్యాక్టీరియాల సంఖ్య పెరిగేలా చేయడం ద్వారా పలు ఆనారోగ్య సమస్యలకు డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఈ పద్ధతినే ప్రో బయోటిక్ థెరపీ (మంచి చేసే సూక్ష్మజీవులతో చికిత్స) అంటున్నారు.
ఐఐఎస్ఈఆర్ రీసెర్చర్లు ఏం చేశారు?
మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను యాక్టివేట్ చేయడం ద్వారా కోలన్ కేన్సర్ ను నిర్మూలించడంపై ఐఐఎస్ఈఆర్ రీసెర్చర్లు దృష్టి పెట్టారు. ఇందుకోసం వారు ప్రో–బయోటిక్ థెరపీని ఎంచుకున్నారు. మనకు హాని చేయని ఒక బ్యాక్టీరియాను ఎంచుకుని, దానిలోకి ఒక ప్రత్యేకమైన కెమికల్ మాలిక్యూల్ ను ప్రవేశపెట్టారు. ‘‘కోలన్ కేన్సర్ సోకిన ప్రతి కేన్సర్ కణంలో ప్రత్యేక మార్కర్ (లాక్టేట్) ఉంటుంది. బ్యాక్టీరియాను పేగుల్లోకి ప్రవేశపెడితే అది లాక్టేట్ ఆకర్షణకు గురై కేన్సర్ కణాలకు అతుక్కుంటుంది. ఆ తర్వాత దానిలోకి చొప్పించిన ప్రత్యేక కెమికల్ ను విడుదల చేస్తుంది. ఈ కెమికల్ ను తెల్ల రక్త కణాలతో కూడిన మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించి, ఆ కేన్సర్ కణాలను నాశనం చేస్తుంది” అని ఐఐఎస్ఈఆర్ స్టూడెంట్స్ తమ రీసెర్చ్ గురించి వివరించారు.
మరో రెండేళ్లలో అందుబాటులోకి..
ఈ ట్రీట్ మెంట్ పద్ధతి మరో ఏడాది లేదా రెండేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఐఐఎస్ఈఆర్ రీసెర్చర్లు తెలిపారు. ప్రస్తుత ట్రీట్ మెంట్ పద్ధతులకు ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. దీనిని ఇంకా జంతువుల్లో పరీక్షించాల్సి ఉందని, ఆ తర్వాత ప్రాక్టికల్ గా విజయవంతం అయ్యాక మార్కెట్లో ఉపయోగించేందుకు అనుమతి లభిస్తుందని తెలిపారు. ఈ పరిశోధన కోసం తమకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బయాలజీ డిపార్ట్ మెంట్ నుంచి రూ. 10 లక్షల గ్రాంటు లభించిందని వారు చెప్పారు.

