బ్యాన్​ చేసిన పెస్టిసైడ్స్‌ అమ్ముతున్నరు

బ్యాన్​ చేసిన పెస్టిసైడ్స్‌ అమ్ముతున్నరు
  • రూల్స్ కు విరుద్ధంగా తయారు చేస్తున్న కంపెనీలు

హైదరాబాద్‌‌, వెలుగుచీడపీడలను చంపాలంటే.. పురుగుమందుల్లో రసాయనాలు ఎంతుండాలో అంతనే ఉండాలె. మోతాదు తక్కువైతే పురుగులు చావవు. ఎక్కువైతే పురుగులతో పాటు మనుషులూ చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లనే ఎకరాకు ఎంత మందు అవసరమో అంతనే పిచికారీ చేయాలె. తక్కువైతే హాని చేసే కీటకాలు చావవు. ఎక్కువైతే మంచి కీటకాలు, పక్షులూ చస్తయి. అంతేకాకుండా.. భూమి కూడా కలుషితమైపోతది. అందుకే.. ఈ విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు అవగాహన కల్పించాలె. మరోవైపు పురుగుమందుల కంపెనీలు, డీలర్లను కంట్రోల్ చేయాలె. కానీ.. ఇలాంటి చర్యలేమీ లేకపోవడంతో రాష్ట్రంలో పురుగుమందుల తయారీ కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా అమ్మకాలు చేస్తున్నాయి. రూల్స్ ను పట్టించుకోకుండా విచ్చలవిడిగా పురుగు మందుల తయారీ, అమ్మకాలతో అందినకాడికి దండుకుంటున్నాయి.

ఇష్టమొచ్చినట్లు అమ్ముతున్నరు

నిబంధనల ప్రకారం, పురుగు మందులు, పెస్టిసైడ్స్ తయారీకి కెమికల్స్‌‌ నిర్ణీత పర్సేంటేజీలోనే ఉపయోగించాలె. కానీ కొన్ని కంపెనీలు నిర్ణీత పర్సంటేజీలో కాకుండా కొన్ని ఉత్పత్తుల్లో ఎక్కువ పరిమాణంలో తయారు చేస్తున్నాయి. కొన్ని ప్రొడక్ట్‌‌ల్లో ఉండాల్సిన పర్సంటేజీ కంటే తక్కువగా ఉంటున్నాయి. ఎక్స్ పర్ట్ లు సూచించిన ప్రమాణాల కంటే ఎక్కువగా ఉంటే అవి విషతుల్యంగా మారి పర్యావరణానికి ముప్పుగా మారుతాయి. ప్రమాణాల కంటే తక్కువగా ఉంటే క్రిమికీటకాలపై ఆ రసాయనాలు పని చేయవు. కానీ, ఇలాంటి రసాయనాలు, క్రిమి సంహాకర మందులను
కొన్ని కంపెనీలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఫెస్టిసైడ్‌‌  కంపెనీలు, డీలర్లు, షాపులకు విచ్చలవిడిగా సరఫరా చేస్తుండటంతో, వాళ్లూ ఇష్టమొచ్చినట్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

రైతులకు అవగాహన కల్పించాలె..

ఏ పంటకు ఏ తెగులొస్తది? ఏ మందు, ఎంత వాడాలె? అన్న విషయాలపై రైతులకు అవగాహన కల్పించేటోళ్లే కరువైండ్రు. దీంతో పక్క రైతులను చూసో, లేదంటే మార్కెట్లో డీలర్లు, షాపుల ఓనర్లు ఏది చెబితే అది, ఎంత చెబితే అంతకు పురుగుమందులు కొంటున్నారు. రైతులకు కొన్నిసార్లు కల్తీ పురుగు మందులను అంటగడుతుండగా, మరికొన్ని సార్లు ప్రమాణాలకు మించి కెమికల్స్ ఉన్న మందులను అమ్ముతున్నారు. దీంతో ఇలాంటి మందులను పిచికారీ చేసిన తర్వాత రైతులు విష ప్రభావంతో మరణిస్తున్న సంఘటనలూ వెలుగు చూస్తున్నాయి. కల్తీ పురుగు మందుల వల్ల తెగుళ్లు పోకుండా పంటలు దెబ్బతినడం, కొన్ని చోట్ల రైతులు చనిపోవడం పైనా కంప్లయింట్లు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ స్పందించి రంగంలోకి దిగింది.

10 కంపెనీల ప్రొడక్ట్ లపై నిషేధం

రాష్ట్రవ్యాప్తంగా పురుగు మందులు తయారు చేసే కంపెనీలు, ప్రతి మండలంలోని షాపుల్లో వ్యవసాయశాఖ ఏఈవోలు శాంపిల్స్ సేకరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు1500 అనుమానిత క్రిమిసంహార మందుల శాంపిళ్లను సేకరించారు. హైదరాబాద్‌‌ రాజేంద్రనగర్‌‌లోని ల్యాబ్‌‌లో, వరంగల్‌‌లోని ల్యాబ్‌‌లో వీటిని పరీక్షించారు. అన్ని శాంపిల్స్‌‌ను అనాలసిస్‌‌ చేయగా,10 కంపెనీల ప్రొడక్ట్‌‌లు పరీక్షల్లో విఫలమయ్యాయి. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆయా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న సంస్థల మందులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ కంపెనీలపై ఫస్ట్‌‌ క్లాస్‌‌ జ్యూడీషియల్‌‌ మెజిస్ట్రేట్‌‌ కోర్టులో చార్జీ షీట్‌‌ ఫైల్‌‌ చేశారు. నిషేధిత కంపెనీల డీలర్‌‌ మీద, కంపెనీ మీద కేసులు బుక్‌‌ చేశారు. ఈ కంపెనీలపై నేరం రుజువు అయితే ఫెస్టిసైడ్స్ చట్టం1961 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంపెనీల రసాయనాలు ఇప్పటికీ మార్కెట్‌‌లో దొరుకుతున్నట్లు తెలుస్తోంది. నిషేధిత కంపెనీలకు అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ నిషేధం విధించినా ఇంకా మార్కెట్‌‌లో ఆ మందులు దొరుకుతుండటం గమనించదగ్గ విషయం.