ఓయూ,వెలుగు : తెలంగాణ ఉద్యమ అమరుల ఆశయాలు నెరవేరలేదని టీజేఎస్అధ్యక్షుడు ప్రొఫెసర్కోదండరాం వ్యాఖ్యానించారు. ఏ ఉద్దేశంతో రాష్ర్టం ఏర్పాటైందో పాలకులు ఆ లక్ష్యాలను విస్మరించారని విమర్శించారు. “ మన అభివృద్ధి –- మన మేనిఫెస్టో.. అన్ని రాజకీయ పార్టీలకు మన మేనిఫెస్టోను అందిద్దాం’’ అనే నినాదంతో తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. ప్రజల హక్కులకు భంగం కలుగుతుందని ప్రశ్నించే వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
సామాజిక తెలంగాణనే అన్నింటికి పరిష్కారమార్గాలు చూపిస్తుందని సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. మరోసారి విద్యార్థి, యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి భూమిపుత్రులకు హక్కులు సాధించుకునే దిశగా ప్లాన్ చేసుకోవాలని తెలంగాణ విఠల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ, జనరల్ సెక్రటరీ వంశీ నాయక్ విద్యార్థి నేతలు పృథ్వీరాజ్, దర్శన్ వెంకట్ నాయక్, వేణుగోపాల్, అంబేద్కర్, ప్రశాంత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
