- ఈ యాసంగిలో కోటీ 40 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
- ఇందులో 85 లక్షల టన్నులు దొడ్డు వడ్లే..
- కానీ రా రైసే కావాలంటున్న ఎఫ్‌సీఐ
- 40 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ను అనుమతించాలంటున్న రాష్ట్ర సర్కారు
- రెండు సీజన్లలో కలిపి 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌కే కేంద్రం ఓకే
- రాష్ట్రంలో రేషన్ కింద ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ
- దీంతో దొడ్డు బియ్యం ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న సివిల్ సప్లైస్ శాఖ
- తీవ్ర గందరగోళం నడుమ వడ్ల కొనుగోళ్లు షురూ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్రాల నడుమ ‘దొడ్డు బియ్యం’ పంచాయితీ మొదలైంది. ఈ యాసంగి సీజన్‌లో రైతులు అత్యధికంగా దొడ్డు వడ్లు సాగు చేశారు. అధికారుల అంచనాల ప్రకారం 85 లక్షల టన్నుల దాకా దొడ్డు వడ్ల దిగుబడి వస్తుంది. వీటిని బాయిల్డ్‌రైస్‌గా మార్చి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కింద ఎఫ్‌సీఐకి పెడ్తామనుకుంటే కేంద్ర ప్రభుత్వం నో అంటున్నది. గత వానాకాలం, ఈ యాసంగి సీజన్లలో కలిపి కేవలం 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే సీఎంఆర్కింద తీసుకుంటామని, మిగిలినదంతా రా రైస్ ఇవ్వాలని తేల్చి చెప్తున్నది. దొడ్డు బియ్యాన్ని రా రైస్‌గా మారిస్తే నూక శాతం పెరిగి భారీగా నష్టం వచ్చే అవకాశముంది. దీంతో కనీసం 40 లక్షల టన్నులకు అనుమతించాలని రాష్ట్రం కోరుతున్నది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లెటర్రాసినా స్పందన రాలేదు. దీంతో ఈ దొడ్డు బియ్యం ఏం చేయాలోనని సివిల్సప్లై అధికారులు తలపట్టుకుంటున్నారు.
గందరగోళం నడుమ కొనుగోళ్లు షురూ
రాష్ట్రంలో వరి కోతలు మొదలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు గడిచిన వారం రోజులుగా వడ్ల లోడ్లతో మిల్లులకు తరలివస్తున్నారు. కానీ బాయిల్డ్ రైస్ కోటా పెంపుపై కేంద్రం నిర్ణయం కోసం ఇంతకాలం ఎదురుచూసిన అధికారులు, ఎట్టకేలకు కొనుగోళ్లు ప్రారంభించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 8,251కు పైగా సెంటర్లు ఓపెన్‌చేయాలని నిర్ణయించగా, శనివారం వరకు1,259కి పైగా సెంటర్ల వరకు ఓపెన్ చేశారు. మందస్తు కోతలు జరుగుతున్న నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మెదక్ జిల్లాల్లోనే ఎక్కువ సంఖ్యలో సెంటర్లు ప్రారంభించారు. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆయా జిల్లాల్లోని అడిషనల్కలెక్టర్లు, సివిల్ సప్లయ్ ఆఫీసర్లను ఏర్పాట్లపై శనివారం పర్యవేక్షించారు. కోతలు ఎలా మొదలైతే అలా సెంటర్లు ప్రారంభించాలని మిగిలిన జిల్లాల్లోని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆ నెలాఖరు కల్లా జోరందుకోనున్న కొనుగోళ్లు
ఈ నెలాఖరు కల్లా రాష్ట్రవ్యాప్తంగా సెంటర్లకు వడ్లు పోటెత్తనున్నాయి. రాష్ట్రంలో యాసంగిలో సాధారణ వరిసాగు విస్తీర్ణం 51.48 లక్షల ఎకరాలు కాగా, ఈ సారి రికార్డు స్థాయిలో 64.11 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 60 శాతానికి పైగా దొడ్డు రకాలే వేశారు. యాసంగి సీజన్‌లో కోటి 42 లక్షల టన్నుల ధాన్యం వస్తుందనే అంచనా కాగా.. ఇందులో దొడ్డు వడ్లు 85 లక్షల టన్నుల వరకు ఉంటాయి. సన్న రకాలపై ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించి ప్రోత్సహిస్తున్నా, యాసంగిలో నీటి సమస్య కారణంగా తక్కువ పంట కాలం ఉన్న దొడ్డు రకాల వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఈసారి 97 లక్షల టన్నుల వడ్లు కొనేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. రైతులు సన్నవడ్లు తినేందుకు ఉంచుకొని దొడ్డు వడ్లను మొత్తానికి మొత్తం సెంటర్లకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 70 నుంచి 80 లక్షల టన్నుల దొడ్డు వడ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
యాసంగి సమస్యే ఇంకా తీరలే
గతేడాది యాసంగి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో బాయిల్డ్ రైస్‌కు సంబంధించి రాష్ట్ర సర్కారు అభ్యర్థనపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2024-–25 యాసంగి సీజన్‌లో 35 లక్షల టన్నుల బియ్యం ఎఫ్ సీఐకి ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర సివిల్ సప్లయ్స్ శాఖ ఫిబ్రవరి 28లోగా ఈ కోటా కంప్లీట్చేయాల్సిఉండగా ఇంకా 8.45 లక్షల టన్నులు పెండింగ్‌లో పెట్టింది. బియ్యం అప్పగించేందు మరో రెండు నెలలు గడువు ఇవ్వాలని, ఇందులో 5 లక్షల టన్నులు బాయిల్డ్‌రైస్ ఇవ్వడానికి వెసులుబాటు కల్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ ప్రతిపాదన ఇంకా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పరిశీలనలోనే ఉంది.
తలపట్టుకుంటున్న సివిల్ సప్లైస్ శాఖ
యాసంగిలో వచ్చే దొడ్డు వడ్లు బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉంటాయి. కానీ కేంద్రం మాత్రం రా రైస్ సప్లై చేయాలని పట్టుబడుతున్నది. బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ఏటా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం ఒప్పుకోవడంలేదు. దీంతో దొడ్డు బియ్యం బాధ్యత రాష్ట్రంపైనే పడుతుంది. 2023–24 యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి కేంద్రం విముఖత చూపడంతో రాష్ట్ర సర్కారు 38 లక్షల టన్నుల ధాన్యాన్ని టెండర్ల ద్వారా అమ్ముకోవాల్సి వచ్చింది. ఫిలిప్పిన్స్, నైజీరియా లాంటి దేశాలకు తప్ప ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేయడానికి కూడా ఇబ్బందులున్నాయి. ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ కేంద్రం కస్టమ్ మిల్డ్ రైస్, బాయిల్డ్ రైస్ లక్ష్యాలను తగ్గించడంతో రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ యేడు రెండు సీజన్లలో బాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచాలని కోరుతూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.
