కొత్త గ్యాస్ కనెక్షన్లకు బ్రేక్..యుద్ధ భయంతో పెరిగిన దరఖాస్తులు

కొత్త గ్యాస్ కనెక్షన్లకు బ్రేక్..యుద్ధ భయంతో పెరిగిన దరఖాస్తులు
  • పెండింగ్​లో పెట్టిన కంపెనీలు
  • డబుల్​సిలిండర్ జారీని సైతం నిలిపివేత
  • గ్యాస్ బుకింగ్స్ వెయిటింగ్ పీరియడ్ కూడా పెంపు
  • ఇదే అదునుగా అక్రమ దందాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్​లో గ్యాస్ కష్టాలు ఆగట్లేదు. కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం చుక్కెదురవుతోంది. ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఎన్నడూ లేని విధంగా కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన డిమాండ్, సరఫరా వ్యవస్థలో ఏర్పడిన జాప్యం కారణంగా గ్యాస్ కంపెనీలు కొత్త కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి.

సాధారణంగా గ్రేటర్ పరిధిలో రోజుకు 150 నుంచి 200 కొత్త కనెక్షన్ దరఖాస్తులు వచ్చేవి కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంఖ్య 300 దాటింది. ఒక్కసారిగా పెరిగిన ఈ తాకిడిని తట్టుకోలేక భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ గ్యాస్ కంపెనీలు కొత్త కనెక్షన్ల ప్రక్రియకు బ్రేక్ వేయడమే కాకుండా, సింగిల్ సిలిండర్ నుంచి డబుల్ సిలిండర్​కు మారాలనుకునే వారి దరఖాస్తులను సైతం పెండింగ్​లో పెడుతున్నాయి.

రోజుకు 75 వేల బుకింగ్​లు.. 

గ్యాస్ కొరత లేదని, కేవలం సరఫరాలో జాప్యం జరుగుతోందని డీలర్లు చెబుతున్నప్పటికీ, ప్రజలు అభద్రతా భావంతో అవసరం లేకపోయినా ముందస్తు బుకింగ్​లు చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 30 లక్షల గ్యాస్ కనెక్షన్​లు ఉండగా, సాధారణ రోజుల్లో రోజుకు 60 వేల నుంచి 75 వేల వరకు ఉండే బుకింగ్​లు, ఇప్పుడు ఏకంగా 1.5 లక్షలకు చేరుకున్నాయి. విపరీతమైన ఈ ఒత్తిడి కారణంగా గ్యాస్ రీఫిల్ వెయిటింగ్ పీరియడ్​ను కూడా డీలర్లు పెంచేశారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 30 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజులు ఆగితే తప్ప తదుపరి బుకింగ్​కు అవకాశం ఇవ్వట్లేదు. 

పక్కదారి పడుతున్న డొమెస్టిక్ సిలిండర్లు

మరోవైపు గ్యాస్ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని నగరంలో అక్రమ దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పర్యవేక్షణ లోపించడంతో సామాన్య వినియోగదారులకు అందాల్సిన గ్యాస్ పక్కదారి పడుతోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో చాలాచోట్ల డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు మళ్లిస్తున్నారు. కొందరు డీలర్లు డెలివరీ బాయ్స్ ద్వారా గ్యాస్​ను బ్లాక్​లో విక్రయించడం, గృహ అవసరాల సిలిండర్ల నుంచి గ్యాస్​ను కమర్షియల్ సిలిండర్లలోకి నింపడం వంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రజల ఆందోళనే కారణం!

ప్రస్తుతం గ్యాస్​కు ఎలాంటి కొరత లేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళన కారణంగానే ఎవరికి వారు అవసరం లేకపోయినా ముందస్తు బుకింగ్​లు చేస్తున్నారు. అందుకే వెయిటింగ్ పీరియడ్ పెరిగింది. – డీ. అశోక్ కుమార్, భారత్ గ్యాస్ డీలర్