- డ్రోన్లతో పట్టణమంతా మ్యాపింగ్.. క్షేత్రస్థాయిలో సర్వే షురూ
- ప్రతి ఆస్తికి హద్దులు.. ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు
- అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు
జగిత్యాల, వెలుగు: భూమి ఎక్కడ ఉంది.. దాని హద్దులెక్కడ? ఎవరి ఆస్తి ఎంత? ప్రభుత్వ భూమి ఏది? చెరువు, ఆలయం, ఇతర సర్కారు స్థలాలు ఎక్కడున్నాయి?... ఇప్పటివరకు పత్రాల్లో ఉన్న ఈ వివరాలన్నీ ఇక డిజిటల్ మ్యాప్‌లోకి రానున్నాయి. భూముల హద్దులు, ఆస్తుల వివరాలను పక్కాగా నమోదు చేసి కబ్జాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమానికి జగిత్యాల ఎంపికైంది. ఇప్పటికే డ్రోన్లతో పట్టణ చిత్రీకరణ పూర్తికాగా.. ప్రస్తుతం సర్వేయర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఆస్తిని పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు.
భూమి లెక్కల్లోనే కాదు.. మ్యాప్‌లోనూ..
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మున్సిపాలిటీలను ‘నక్ష’ పైలట్‌ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఇందులో జగిత్యాల కూడా ఉంది. సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సర్వేయర్లు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రతి భవనం, ఖాళీ స్థలం, ఆస్తికి సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. కొలతలు తీసి హద్దులు నిర్ధారిస్తారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు కల్పించి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీంతో ఒక ఆస్తి ఎక్కడ మొదలవుతుంది.. ఎక్కడ ముగుస్తుందనే వివరాలు స్పష్టంగా అందుబాటులోకి రానున్నాయి.
కబ్జాదారుల ఆటలకు చెల్లు
ఇప్పటివరకు పాత రికార్డులు, పత్రాలు, హద్దుల ఆధారంగా భూముల వివరాలను గుర్తించాల్సి వచ్చేది. జిల్లా కేంద్రం విస్తరిస్తున్నకొద్దీ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ఆస్తుల ఆక్రమణలు జరిగాయి. కానీ ‘నక్ష’లో ప్రతి ఆస్తి భౌగోళిక హద్దులతో నమోదవుతుంది. ప్రైవేట్ ఆస్తులే కాకుండా ప్రభుత్వ భూముల వివరాలను కూడా పొందుపరచనున్నారు. చెరువులు, ఆలయాలకు సంబంధించిన భూములు, ఇతర ప్రభుత్వ స్థలాల హద్దులను గుర్తించి రికార్డుల్లో నమోదు చేస్తారు. దీంతో ప్రభుత్వ ఆస్తులను గుర్తించడం, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం సులభం కానుంది. కబ్జాదారులకు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, హద్దులు మార్చడం అంత ఈజీ కాదు.
35 వేలకుపైగా ఇండ్లు..
జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు, లక్షకు పైగా జనాభా ఉంది. పట్టణంలో 35 వేలకుపైగా ఇండ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, ఇతర నిర్మాణాలను కూడా సర్వేలో నమోదు చేయనున్నారు. ఇప్పటికే డ్రోన్లతో పట్టణంలోని భవనాల చిత్రీకరణ పూర్తయింది. ఈ డేటాకు క్షేత్రస్థాయి వివరాలను జోడించనున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ఆస్తుల వివరాలను రికార్డుల్లో పొందుపరిచి సమగ్ర మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. సంబంధిత ఆస్తులకు ఆర్‌వోఆర్‌లో చోటు కల్పించి యజమానులకు పట్టాలు, గుర్తింపు కార్డులు అందించే అవకాశం ఉంది. దీంతో భూమికి సంబంధించిన వివరాలు మరింత పక్కాగా నమోదు కానున్నాయి.
జగిత్యాలకు నక్షతో సమగ్ర భూ రికార్డు
నక్ష కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని భవనాలను డ్రోన్లతో చిత్రీకరించే ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయిలో ఆస్తుల వివరాలు, హద్దులను పరిశీలించి నమోదు చేసే పనులు ప్రారంభించాం. ప్రతి ఆస్తికి స్పష్టమైన గుర్తింపు కల్పించి రికార్డుల్లో పొందుపరుస్తాం. సంబంధిత యజమానులకు పట్టాలు అందించే అవకాశమూ ఉంది. పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.-శ్రీనివాస్, డీటీసీపీవో, జగిత్యాల
