తెలంగాణ సలసల!.. రెండు జిల్లాలు మినహా.. అంతటా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు

తెలంగాణ సలసల!.. రెండు జిల్లాలు మినహా.. అంతటా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు
  •    రెండు జిల్లాలు మినహా అంతటా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు
  •     20 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా నమోదు.. అత్యధికంగా జగిత్యాలలో 41.7 డిగ్రీలు
  •     దక్షిణ తెలంగాణ జిల్లాల్లో  పెరుగుతున్న నైట్​ టెంపరేచర్లు
  •     వచ్చే రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రం సలసలా మసిలిపోతున్నది. ఎండలు తీవ్రమవుతున్నాయి. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా మంట, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్​ను దాటేశాయి. అందులో 20 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్​ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇటు రాత్రి ఉష్ణోగ్రతలు సెంట్రల్, సౌత్​ జిల్లాల్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్​ సిటీలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్​లోనే హయ్యెస్ట్​ కావడం గమనార్హం. ఇక, శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 41.7 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. ఖమ్మం జిల్లా గుబ్బగుర్తి, ములుగు జిల్లా ఆలుబాక, నల్గొండ జిలా ఘనపూర్, నిర్మల్​ జిల్లా మామడ, నిజామాబాద్​ జిల్లా భీంగల్​లో 41.6, కుమ్రంభీం ఆసిఫాబాద్​ సిర్పూర్, మహబూబాబాద్​ జిల్లా ఉప్పరగూడెం, మంచిర్యాల జిల్లా తాండూరు, నాగర్​కర్నూలు జిల్లా ఎంగంపల్లి, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 41.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జయశంకర్​భూపాలపల్లి, మహబూబ్​నగర్, జోగుళాంబ గద్వాల, సూర్యాపేట, వరంగల్​ జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్​ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. 

నైట్​ టెంపరేచర్లు హైదరాబాద్​లోనే ఎక్కువ

పగటి ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా నమోదైతే.. రాత్రి టెంపరేచర్లు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్​ సిటీలోనే హయ్యెస్ట్​ రికార్డ్​ అయ్యింది. హైదరాబాద్​ సిటీలోని వెస్ట్​మారేడుపల్లిలో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం నైట్​ టెంపరేచర్లు 20 డిగ్రీలలోపే రికార్డ్​అవుతున్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 17 డిగ్రీలు రికార్డయింది. ఆదిలాబాద్​ జిల్లాలో 18.4 డిగ్రీలుగా నమోదైంది. కాగా, వచ్చే రెండు వారాల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతాయని ఐఎండీ వార్నింగ్​ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుందని 
హెచ్చరించింది. 

వర్షాలు తక్కువే.. 

రాష్ట్రంలో వర్షాకాలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులే ఉండబోతున్నాయి. స్కైమెట్​తో పాటు తెలంగాణ వెదర్​ మ్యాన్​ మాన్​సూన్​ ఫోర్​కాస్ట్​లో ఈ విషయం వెల్లడైంది. ఎల్​నినో అత్యంత తీవ్రంగా ఉంటుందని, హిందూ మహాసముద్రంలోనూ అదే పరిస్థితి ఉండబోతున్నదని ఫోర్​కాస్ట్​లో పేర్కొన్నారు. సాధారణం లేదంటే అంతకన్నా తక్కువ వర్షపాతమే ఈ సారి నమోదవుతాయని, 2018 నాటి పరిస్థితులే ఈ వర్షాకాలంలో ఉంటాయని తెలుస్తున్నది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలంగాణ వెదర్​ మ్యాన్​ హెచ్చరించారు.