- రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ 2025లో విదేశీ పర్యటనలకు రూ. 180 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జపాన్ సహా 23 దేశాలలో మోదీ పర్యటించినట్టు తెలిపింది. రాజ్యసభలో గురువారం అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వం వివరాలు అందించింది. జులై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనతో కలిపి, 2026 ఏడాదికి సంబంధించి రూ. 74.58 కోట్లు ఖర్చయినట్టు తెలిపింది.
ఎంపీలు సంజయ్ సింగ్, వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈ సమాచారం అందించారు. గత ఏడాది ప్రధాని ఫ్రాన్స్ పర్యటనకు రూ. 25 కోట్లు, అమెరికా టూర్‌కు రూ.16 కోట్లు, సౌదీ అరేబియా పర్యటనకు రూ.15 కోట్లు, బ్రెజిల్ టూర్‌కు రూ.17 కోట్లు, చైనా పర్యటనకు రూ.10 కోట్లు, బ్రిటన్ పర్యటనకు రూ. 9.9 కోట్లుఖర్చు అయినట్టు వివరించారు.
అలాగే, 2021 నుంచి 2024 వరకు ప్రధాని విదేశీ పర్యటనల కోసం సుమారు రూ. 295 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. ఇందులో 2024లో (16 దేశాలకు) రూ. 109 కోట్లు, 2023లో రూ. 93 కోట్లు, 2022లో రూ. 55.82 కోట్లు, 2021లో సుమారు రూ. 36 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. అయితే, 2021 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబరు మధ్య కాలంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 381.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని.. అలాగే, ఈ పర్యటనల కాలంలో మొత్తం 316 అవగాహన ఒప్పందాలు కుదిరినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో భారతదేశ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, సాంకేతికత, రక్షణ, ఇంధన సహకారం వంటి రంగాలలో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రధాని విదేశీ పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.
