జార్ఖండ్‌‌‌‌లో 13వ రోజుకు స్టూడెంట్ల ఆందోళన..చర్చలకు పిలిచిన ప్రభుత్వం

జార్ఖండ్‌‌‌‌లో 13వ రోజుకు స్టూడెంట్ల ఆందోళన..చర్చలకు పిలిచిన ప్రభుత్వం
  • రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ పరీక్షల్లో అక్రమాలపై కొనసాగుతున్న నిరసనలు

రాంచీ: జార్ఖండ్‌‌‌‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన గురువారానికి 13వ రోజుకు చేరింది. గత నెల 25 నుంచి ‘జేపీఎస్సీ–జేఎస్సీఎస్సీ రిఫార్మ్స్ మంచ్’ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరుగురు స్టూడెంట్స్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. 

సీఎం హేమంత్ సోరెన్ చర్చలకు సిద్ధమని ప్రకటించడంతో 8 మంది నిరుద్యోగులు, ఇద్దరు జర్నలిస్టులు, ఒక అడ్వకేట్​తో కూడిన11 మంది ప్రతినిధుల బృందం ఏర్పాటైంది. వీరు ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. ప్రభుత్వం తరఫున ఐదుగురు చర్చల్లో పాల్గొంటారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్​సీ)ను, సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని, నియామక పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ లేదా రాష్ట్రం వెలుపల ఉన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరపాలని స్టూడెంట్స్​ డిమాండ్ చేస్తున్నారు. 

అలాగే జేపీఎస్సీ, జేఎస్సీఎస్సీల్లో సంస్కరణలు చేపట్టాలని కోరుతున్నారు. గురువారం ప్రారంభమైన రాష్ట్ర శాసనసభలోనూ ఇదే అంశంపై నిరసనలు కొనసాగాయి. మరోవైపు నియామక పరీక్షల అక్రమాల కేసులో దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశారు.  

మద్దతు ప్రకటించిన సీజేపీ  

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జార్ఖండ్​లో స్టూడెంట్స్ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. సంస్థ సభ్యులు జార్ఖండ్‌‌‌‌కు వెళ్లి విద్యార్థులకు అండగా నిలుస్తారని తెలిపారు. మరోవైపు జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించకపోవడాన్ని బీజేపీ విమర్శించింది. జార్ఖండ్​లో కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వం ఉండడంతోనే ఆయన మౌనం పాటిస్తున్నారని బీజేపీ నేత ప్రదీప్ భండారి ఆరోపించారు.