- దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానా పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వివాదం సివిల్ స్వభావానికి చెందినదనే కారణంతో క్రిమినల్ కేసును రద్దు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్, నటులు వెంకటేశ్, రాణా దగ్గుబాటి తదితరులపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. జూబ్లీహిల్స్‌లో స్థలం లీజుకు సంబంధించిన వివాదంలో కోరే నందకుమార్ దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ కేసును రద్దు చేయాలంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ ఎన్.తుకారాంజీ విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ, ఈ వ్యవహారం పూర్తిగా సివిల్ స్వభావానికి చెందినదని, దానిని క్రిమినల్ కేసుగా మార్చి తమను వేధిస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వాదిస్తూ.. లీజులో ఉన్న ప్రాంగణంలోకి పిటిషనర్లు అక్రమంగా ప్రవేశించి, తలుపులు ధ్వంసం చేసి, అక్కడి వస్తువులను తీసుకెళ్లారని చెప్పారు. ఈ అంశాల ఆధారంగానే ప్రైవేటు ఫిర్యాదు దాఖలై, మేజిస్ట్రేట్ కేసును స్వీకరించారని వివరించారు. ఇరు వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి, ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదు, దానికి జతచేసిన అఫిడవిట్‌లను పరిశీలించిన అనంతరమే ఈ కేసును మేజిస్ట్రేట్ స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేసును కొట్టివేయడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదులోని అంశాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే విచారణ కోర్టు ముందే వినిపించాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.
