ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’.. రాహుల్ గాంధీ స్పెషల్ ప్రోగ్రాం

ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’.. రాహుల్ గాంధీ స్పెషల్ ప్రోగ్రాం
  • విద్యార్థుల గొంతు వినిపించకుండా ఆపలేరన్న ప్రతిపక్ష నేత 

న్యూఢిల్లీ: దేశంలోని యువత, ముఖ్యంగా జెన్-జీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌‌‌‌ను ప్రారంభించారు. విద్యార్థులు నేరుగా తనతో సంభాషించాలని, తమ సందేహాలను అడగాలని ఆయన ఈ వేదిక ద్వారా ఆహ్వానించారు. ఇన్‌‌‌‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వచ్చే ప్రశ్నల్లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు బదులిస్తానని తెలిపారు. ఈ మేరకు గురువారం 'ఎక్స్' వేదికగా లింక్‌‌‌‌ను షేర్ చేస్తూ విద్యార్థులు, జెన్-జీ తమ సమస్యలు పంచుకోవాలని పేర్కొన్నారు. 

కాగా, ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విద్యార్థుల గొంతు వినిపించకుండా తనను ఎవరూ ఆపలేరని  రాహుల్  అన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ కేంద్రం యువత గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌లోని కేపీ గ్రౌండ్‌‌‌‌లో ఆగస్టు 8న తలపెట్టిన 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గొంతుక) కార్యక్రమానికి నిర్వాహకులు అనుమతి రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.