- రాత్రివేళ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం నిర్ణయం
- అదనపు భారమని వాహనాల యజమానుల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: వాహనాలకు రేడియం స్టిక్కర్ తప్పనిసరి నిబంధన అమలు విషయంలో రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాత్రిపూట ప్రధాన రహదారుల పక్కన వెహికల్స్ ను ఇష్టారీతిన నిలపడంతో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లను తగ్గించేందుకు ప్రతి వాహనానికి రిఫ్లెక్టెడ్ స్టిక్కర్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.ఈ నిబంధనను విధిగా అమలు చేసేందుకు అధికారులు వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కు రేడియం స్టిక్కర్ ను లింక్ చేశారు. ఇకపై ఫిట్నెస్ సిర్టిఫికెట్ ఇవ్వాలంటే క్యూ ఆర్ కోడ్ ఉన్న రేడియం స్టిక్కర్ లను వాహనానికి నాలుగు వైపుల వేసుకోవాల్సిందేనని అధికారులు తెలిపారు. రవాణా శాఖ జారీ చేసే రేడియం స్టిక్కర్ ను వాహనానికి అతికించి క్యూ ఆర్ కోడ్ ను ఆన్‌లైన్ లో ఆప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
అలా చేస్తేనే ఆన్‌లైన్ లో ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రవాణా శాఖ లాగిన్ ఓపెన్ అవుతోంది. అయితే, ఈ రూల్ భారీ వాహన యజమానులకు ఇబ్బందిగా మారింది. ఏడాదికోసారి వాహన ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుందని, దీంతో ఏటా రేడియం స్టిక్కర్ లను అంటించడం అంటే ఆర్థికంగా తమకు ఇబ్బందులు తప్పవని యజమానులు ఆరోపిస్తున్నారు. రేడియం స్టిక్కర్ కోసం రూ. 3500 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
వీటిని సరఫరా చేసే సంస్థలు రూ.5 వేల వరకు వాహన యజమానులకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేడియం స్టిక్కర్ల పేరుతో తమను దోపిడీ చేస్తున్నారని, నిబంధనలను మార్చాల్సిందేనని అంటున్నారు. ఇటు ప్రతి మూడు నెలలకోసారి రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తూ...ఏడాదికోసారి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లిన ప్రతిసారి రిఫ్లెక్టెడ్ స్టిక్కర్ లను కొనుగోలు చేయడం తమను ఆర్థికంగా దివాళా తీయిస్తుందని వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
