గ్లోబల్ మార్కెట్‌‌‌‌కు మన వర్క్ ఫోర్స్ ..దేశ జీడీపీలో 8 శాతం వాటా తెలంగాణాదే: మంత్రి వివేక్ వెంకటస్వామి

గ్లోబల్ మార్కెట్‌‌‌‌కు మన వర్క్ ఫోర్స్ ..దేశ జీడీపీలో 8 శాతం వాటా తెలంగాణాదే: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఏటీసీల్లో శిక్షణ పొందిన యువతకు జర్మనీలాంటి దేశాల్లో ఉపాధి: మంత్రి వివేక్‌‌‌‌
  • టామ్‌‌‌‌కామ్‌‌‌‌లో శిక్షణ కోసం 12 మిలియన్ యూరోలతో ప్రత్యేక నిధి  
  • త్వరలో మరో 53 ఏటీసీ కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడి
  • జర్మనీలోని ఎర్లాంజెన్‌‌‌‌లో మంత్రి పర్యటన.. తెలంగాణ బిడ్డలతో ప్రత్యేక భేటీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రంగా మారుతున్నదని కార్మిక, ఉపాధి, శిక్షణా శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గ్లోబల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌కు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. శనివారం జర్మనీలోని ఎర్లాంజెన్ నగరంలో ‘జర్మనీలో తెలంగాణోళ్లం’, ‘టైగర్ ఈవీ’ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో వివేక్‌‌‌‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బవేరియా రాష్ట్ర హోం మంత్రి జోచిమ్ హెర్మాన్, ఎర్లాంజెన్ మేయర్ జోర్గ్ వోలెత్‌‌‌‌లాంటి ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రవాసులు, వివిధ రంగాల నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ–-జర్మనీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని వెల్లడించారు. 

దేశ జీడీపీలో 8 శాతం వాటా తెలంగాణాదే..

దేశ జనాభాలో కేవలం 3 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ, దేశ జీడీపీలో దాదాపు 8 శాతం వాటాను అందిస్తూ అగ్రగామిగా నిలుస్తున్నదని మంత్రి వివేక్ ప్రకటించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 65 అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ టెక్నాలజీ సెంటర్స్‌‌‌‌ను (ఏటీసీ) ఏర్పాటు చేశామని, మరో 53 కేంద్రాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించారు. ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన యువత.. జర్మనీలాంటి దేశాల్లో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. జర్మనీ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ

అంతర్జాతీయ ఉపాధి రంగంలో తెలంగాణ యువతకు పెద్దపీట వేసేందుకు ‘టామ్ కామ్’ ద్వారా 12 మిలియన్ యూరోల నిధులతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు మంత్రి వివేక్ వెల్లడించారు. ముఖ్యంగా జర్మనీలో స్థిరపడాలనుకునే వారికి జర్మన్ భాషా నైపుణ్యం ఎంతో కీలకమని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.  ఇప్పటికే జర్మనీలోని లోయర్ సాక్సోనీ రాష్ట్రంతో కొనసాగుతున్న సహకారాన్ని, భవిష్యత్తులో బవేరియాలాంటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నదని చెప్పారు.  బవేరియా హోం మంత్రి జోచిమ్ హెర్మాన్ మాట్లాడుతూ.. భారతీయ నిపుణుల ప్రతిభను కొనియాడారు. తెలంగాణ, బవేరియాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కిరణ్ కుమార్ వంగపల్లి చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.


తెలంగాణ బిడ్డలతో మంత్రి ముచ్చట్లు

ఎర్లాంజెన్ నగర గౌరవానికి చిహ్నంగా ఉన్న ‘సిటీ గెస్ట్ బుక్’పై మేయర్ జోర్గ్ వోలెత్‌‌‌‌తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి సంతకం చేశారు.  అనంతరం ప్రవాస తెలంగాణ బిడ్డలతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘టైగర్ ఈవీ’  ‘జర్మనీలో తెలంగాణోళ్లం’ సంస్థలు ప్రవాసుల మధ్య బంధాన్ని పెంచడంలో పోషిస్తున్న పాత్రను  అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు కిరణ్ కుమార్ వంగపల్లి మాట్లాడుతూ.. మంత్రి పర్యటన ప్రవాసుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, తెలంగాణ–-బవేరియా మధ్య వారధిగా తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.