పార్లమెంటులో స్మృతి తీరుపై చౌదరి పిర్యాధు

పార్లమెంటులో స్మృతి తీరుపై చౌదరి పిర్యాధు

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు క్షమాపణలు తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దేశానికి తొలి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముపై తనకు అత్యంత గౌరవం ఉందని తెలిపారు. తన మాతృభాష బెంగాలీ అని, హిందీలో అంతగా ప్రావీణ్యం లేని కారణంగా ఈ తప్పు జరిగిందని చెప్పుకొచ్చారు. కానీ అధికార పార్టీ రాష్ట్రపతి జీ పేరును లాగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నోరు జారడం వల్లనే ఈ వివాదం చెలరేగిందన్న ఆయన.. దీనికి సోనియా గాంధీకి ఎలాంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు.

దీంతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో ప్రవర్తించిన తీరును సైతం అధీర్ రంజన్ చౌదరి లేఖలో ప్రస్తావించారు. ఆమె సోనియా గాంధీ పట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. ఇక్కడ మరో విషయాన్ని కూడా ఎంపీ ప్రస్తావించారు. గౌరవనీయమైన రాష్ట్రపతి పేరును సభలో తీసుకురావడం సరైంది కాదన్న ఆయన.. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ పదే పదే ఇలా పేరుతో పిలవడం సమంజసం కాదన్నారు. ఇలా మాటిమాటికీ ద్రౌపది ముర్ము అని స్మృతి ఇరానీ అరుస్తున్నారని.. ఎంతో గౌరవనీయమైనదిగా భావించే ఆమె పేరు ముందు రాష్ట్రపతి గానీ, లేదంటే మేడమ్ అని గానీ సంబోధించడం లేదని ఆరోపించారు. ఇది కచ్చితంగా రాష్ట్రపతి పదవిని దిగజార్చడమే అవుతుందన్నారు. ఇరానీ వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంకో విషయమేమిటంటే తాను చేసిన వ్యాఖ్యలకు, సోనియా గాంధీకి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఆమె పేరును లాగాయని చెప్పారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలు సోనియా గాంధీని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అధికార పక్షం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సృష్టించిన అలజడి కారణంగా అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. అంతకు మునుపే చౌదరి తాను "రాష్ట్రపత్ని" అన్న వ్యాఖ్యకు క్షమాపణలు కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. పొరపాటున తప్పు పదాన్ని ఉపయోగించినందుకు నా విచారం వ్యక్తం చేస్తున్నానని, దీన్ని ఆయన స్లిప్ ఆఫ్ టంగ్ గా అభివర్ణించారు. తన క్షమాపణను అంగీకరించాలని చౌదరి లేఖలో పేర్కొన్నారు.