కరీంనగర్ సీపీ కమలాసన్‌‌‌‌ రెడ్డికి ఊరట

కరీంనగర్ సీపీ కమలాసన్‌‌‌‌ రెడ్డికి ఊరట

కోర్టు ధిక్కారం కేసులో స్టే విధించిన హైకోర్ట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కోర్టు ధిక్కార కేసులో జైలు శిక్ష పడిన కరీంనగర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ (సీపీ), మరో ఇద్దరు పోలీసు ఆఫీసర్లకు హైకోర్టులో ఊరట లభించింది. సీపీ కమలాసన్‌‌‌‌ రెడ్డి, కరీంనగర్‌‌‌‌ ఏసీపీ తిరుపతి, ఎస్‌‌‌‌హెచ్ఓ శశిధర్‌‌‌‌రెడ్డిలకు గతంలో సింగిల్‌‌‌‌ జడ్జి 6 నెలలు జైలు శిక్ష విధించారు. అయితే, ఆ తీర్పుపై అప్పీల్‌‌‌‌ చేసుకునేందుకు వీలుగా సింగిల్‌‌‌‌ జడ్జి తన తీర్పును సస్పెన్షన్‌‌‌‌లో పెట్టారు. జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా కట్టాలని, న్యాయ సేవాధికార సంస్థకు రూ.10 వేల చొప్పున కట్టాలని కూడా తీర్పులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని వారు అప్పీల్ చేయగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఆర్ఎస్‌‌‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఎ.అభిషేక్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సోమవారం స్టే ఇచ్చింది. పోలీసులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కరీంనగర్‌‌‌‌లోని పుష్పాంజలి కంట్రీ రిసార్ట్‌‌‌‌పై దాడి చేశారంటూ దాఖలైన కోర్టు ధిక్కార కేసులో సింగిల్‌‌‌‌ జడ్జి వారికి జైలు శిక్ష విధించారు. ఆ తీర్పుపై అప్పీల్ ను హైకోర్ట్ డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరిస్తూ ఈ మేరకు స్టే విధించింది.

In contempt of court HC stays in Karimnagar CP Kamalasan Reddy