న్యాయంగా చూస్తే మేయర్ పదవి బీసీలకే దక్కాలి

న్యాయంగా చూస్తే మేయర్ పదవి బీసీలకే దక్కాలి

గతంలో ఎన్నడూ లేని విధంగా గల్లీ ఎన్నికలు కాస్తా ఢిల్లీ ఎన్నికల స్థాయిలో  జరిగాయి. హైదరాబాద్ మేయర్ పీఠం కోసం అన్ని పార్టీలూ హోరాహోరీగా పోరాడాయి. మేయర్ పదవిని మహిళ (జనరల్)కు రిజర్వ్ చేయడంతో పార్టీలన్నీ భారీ సంఖ్యలో మహిళలను పోటీలో దించాయి. మొత్తం 150 డివిజన్లకు గాను చివరిగా ఫలితం తేలిన నేరేడ్​మెట్ తో కలిపి 79 చోట్ల మహిళలే కార్పొరేటర్లుగా విజయం సాధించారు.  ఈ ఎన్నికల్లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్ మెంట్ ఏమంటే గతంలో ఎప్పుడూ లేనంతగా గెలిచిన వారిలో దాదాపు 60 శాతం బీసీ అభ్యర్థులే ఉన్నారు. ఇప్పుడు న్యాయంగా చూస్తే మేయర్​ పీఠం కూడా బీసీలకు దక్కేలా చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది.

బీసీలకు ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో దెబ్బ

జనరల్ మహిళా రిజర్వ్ అయిన మేయర్ పదవిని.. జనాభా ప్రాతిపదికన చూసినా, గెలిచిన కార్పొరేటర్ల సంఖ్యను బట్టి చూసినా మేయర్ పదవికి నిజమైన అర్హులు బీసీలే. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల సందర్బంగా అన్ని పార్టీలు బీసీ కులాలకు పెద్ద పీట వేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. గత 70ఏళ్లుగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయే కానీ, వీరికి రాజ్యాధికారం ఇవ్వడం లేదు. రాజకీయ పార్టీలే కాదు, గెలిచిన బీసీ అభ్యర్థులంతా కూడా మేయర్ పదవిని బీసీకి ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని గట్టిగా పట్టుబట్టాలి. చట్ట సభల్లో జనాభా రేషియో ప్రకారం బీసీ నాయకులు ఉండేలా పోరాడితేనే రాజ్యాధికారం సొంతం చేసుకోగలుగుతాం. రేపటి రోజున ఏ పార్టీ మేయర్ పదవిని సొంతం చేసుకున్నా సరే.. ఆ పీఠంపై బీసీనే కూర్చోబెట్టి సామాజిక న్యాయం చేయాలి. లేదంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయా పార్టీలకు ఎదురు దెబ్బ తగలడం ఖాయం.