పోడు భూముల్లో పంట ధ్వంసం చేయొద్దని ఏకగ్రీవ తీర్మానం

పోడు భూముల్లో పంట ధ్వంసం చేయొద్దని ఏకగ్రీవ తీర్మానం
  • ఐటీడీఏ పాలకమండలి మీటింగ్
  • పంటలు ధ్వంసం చేయొద్దని భద్రాచలం ఐటీడీఏ తీర్మానం
  • హాజరైన మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్

భద్రాచలం,వెలుగు: 34 నెలల తర్వాత నిర్వహించిన ఐటీడీఏ పాలకమండలి మీటింగ్లో పోడు భూముల మీదే ప్రధానంగా చర్చ జరిగింది. ఎజెండాలో మొత్తం 12 అంశాలు ఉండగా అటవీహక్కుల చట్టం, విద్య, వైద్యం, గురుకులాల మీద చర్చించి మిగతా ఎజెండాను పక్కన పెట్టేశారు. పోడు చేసుకొనే వారికి భూములపై హక్కులు కల్పించాలని మొంబర్లు సూచించారు. పోడు భూములు సాగు చేస్తున్న పంటలను ధ్వంసం చేయొద్దని తీర్మానం చేశారు. శుక్రవారం భద్రాచలం ఐటీడీఏలోని గిరిజన భవన్లో పాలకమండలి సమావేశం జరిగింది. మౌలిక సౌకర్యాలు కల్పించడం, గిరిజన ప్రాంతాల్లో డెవలప్మెంట్​ వర్క్స్పై ఎలాంటి చర్చ జరగలేదు. ఇదిలాఉంటే రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్లో తొలి మీటింగ్​ సందర్భంగా భవన నిర్మాణంలోని డొల్లతనం బయటపడింది. భవనం మొత్తం లీకై మీటింగ్​ హాలులోకి నీరు వచ్చింది. ట్రైబల్​ వెల్ఫేర్​ మినిస్టర్​ సత్యవతి రాథోడ్, ట్రాన్స్ పోర్ట్​ మినిస్టర్​ పువ్వాడ అజయ్​కుమార్, కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్​ దురిశెట్టి, ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్​ కవిత, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, పొదెం వీరయ్య, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీచైర్మన్​ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్​ కూరపాటి నాగభూషణం, లైబ్రరీ చైర్మన్​ దిండిగల రాజేందర్, మహబూబా​బాద్​ జడ్పీ చైర్మన్ అంగులోత్​ బిందు తదితరులు హాజరయ్యారు. 

సమస్యలపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య నిలదీత
మీటింగ్​కు హాజరైన ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే పొదెం వీరయ్య మీటింగ్​లో సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడం లేదని నిలదీశారు. ఒక దశలో ఎజెండాలో లేని అంశాలను చర్చిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.  తీర్మానాలన్నీ బుట్టదాఖలు చేస్తున్నారని, రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్  భద్రాచలంకు అన్యాయం చేశారని అనడంతో ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ సభ కాదని, సీఎంపై మీటింగ్​లో ఆరోపణలు చేయడం తగదని మినిస్టర్​ పువ్వాడ అన్నారు. అయినా తగ్గని వీరయ్య తన నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు దళితబంధు ఎందుకు నిలిపి వేశారని, దీనిపై మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 207 పోస్టులు ఖాళీగా ఉండడంపై నిలదీశారు. చర్లలో 108 మొరాయించడంతో ఆదివాసీ యువతి మరణించిన విషయాన్ని ఇర్ప శాంత మీటింగ్​ దృష్టికి తీసుకొచ్చారు. కొత్త అంబులెన్స్  ఇస్తున్నట్లు కలెక్టర్​ అనుదీప్​ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సపోర్టు చేయడం లేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఏకలవ్య స్కూళ్లను ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.300 కోట్ల నిధులను నిలిపివేశారని విమర్శించారు. ఐదు పంచాయతీలు, విభజన సమస్యలు, లోకల్, నాన్​లోకల్​ సమస్యపై పార్లమెంట్​ సమావేశాల్లో నిలదీస్తానని తెలిపారు. పోడుభూముల్లో గిరిజనులు సాగు చేస్తున్న పంటలను ధ్వంసం చేయొద్దని పాలకమండలి మీటింగ్​లో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు ప్రకటించారు. మీటింగ్​ ఆలస్యమైనా గిరిజనులకు అవసరమైన స్కీమ్​లు అమలు చేయడంలో ఎక్కడా లోటు రాలేదని మినిస్టర్లు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్​ తెలిపారు. మీటింగ్​లో చర్చించిన ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.