కమ్యూనిస్టులతో కలిసి స్టీరింగ్ కమిటీ

కమ్యూనిస్టులతో కలిసి స్టీరింగ్ కమిటీ
  • 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు
  • పోలింగ్ వరకు అక్కడే మకాం 
  • ఒక్కో ఎమ్మెల్యేకి 2,500 మంది ఓటర్ల బాధ్యతలు
  • 100 మందికి ఒక ఇన్‌‌చార్జి
  • ఇంటింటి ప్రచారానికి ప్లాన్
  • కుల, మహిళా సంఘాలు, రైతులతో సమావేశాలు
  • మునుగోడు రూపంలో బీఆర్ఎస్‌‌కు తొలి పరీక్ష
  • అభ్యర్థిగా కూసుకుంట్లను నేడు ప్రకటించే చాన్స్!

ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో ముందుగా స్థానిక నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. అందులో చురుకైన వాళ్లను ఎంపిక చేసుకొని 100 మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జి చొప్పున నియమిస్తారు. ఈ ఇన్​చార్జ్​లు ఎన్నికలు ముగిసేదాకా తమ ఓటర్లపై ఓ కన్నేసి ఉంచుతారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలోనే కులసంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, రైతులు.. ఇలా వర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటుచేసి వాళ్ల అవసరాలు, సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి హామీలు ఇస్తారు. పోలింగ్‌‌కు మూడు రోజుల ముందు వరకు వీలైనన్ని ఎక్కువ రోజులు ఇక్కడే ఉండి ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఓటరునూ కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు.

నల్గొండ /  హైదరాబాద్​, వెలుగు: ఒకవైపు బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్న టీఆర్ఎస్.. మరోవైపు మునుగోడు దిశగా తమ పార్టీ మొత్తాన్ని మోహరిస్తున్నది. జాతీయ పార్టీ ఏర్పాటు తమ లక్ష్యం అంటూనే బై ఎలక్షన్‌‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.​ గులాబీ దళం మొత్తాన్ని మునుగోడుకు పంపుతున్నది. 2,500 ఓటర్లకు ఒక ఎమ్మెల్యే చొప్పున వివిధ జిల్లాలకు చెందిన 86 మంది ఎమ్మెల్యేలు అక్కడే బస చేయాలని పార్టీ ఆదేశించింది. మొత్తం మంత్రివర్గానికి బై ఎలక్షన్ బాధ్యతలను అప్పగించింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు మానిటరింగ్ బాధ్యతలను అప్పగించింది. బై ఎలక్షన్‌‌కు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలు కానుండగా.. సాయంత్రానికల్లా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ మునుగోడు నియోజకవర్గం చేరుకోవాలని రాష్ట్ర పార్టీ సమాచారం చేరవేసింది. పోలింగ్‌‌కు మూడు రోజుల ముందు దాకా.. వీలైనన్ని ఎక్కువ రోజులు అక్కడే ఉండాలని సూచించింది. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలని, ఓటర్లను నేరుగా కలవాలని ఆదేశాలిచ్చింది.

మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గట్టెక్కాలని భావిస్తున్న టీఆర్ఎస్ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నది. కమ్యూనిస్టు నాయకులతో కలిసి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఈ కమిటీనే ప్రచార బాధ్యతలను పర్యవేక్షించనుంది. స్టీరింగ్ కమిటీలో టీఆర్ఎస్ నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, సీపీఐ నుంచి మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ సీతారాములు, సీపీఎం నల్గొండ, యాదాద్రి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జహంగీర్‌‌‌‌ను సభ్యులుగా నియమించారు. కమ్యూనిస్టు కుటుంబాల ఓట్లన్నీ టీఆర్ఎస్ కు పోలయ్యేలా జాగ్రత్త పడేందుకే ఈ కమిటీని నియమించారు.

బీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్‌‌‌‌కు మునుగోడు బై ఎలక్షన్ రూపంలో తొలి పరీక్ష ఎదురుకానున్నది. ఒకవేళ మునుగోడులో ఓడిపోతే బీఆర్ఎస్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే మునుగోడు ఎలక్షన్‌‌‌‌ను టీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్‌‌‌‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే గురువారం ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్‌‌‌‌చార్జిగా నియమించింది. 2 వేల నుంచి 3 వేల ఓట్లను (సగటున 2,500 ఓట్లను) ఒక యూనిట్‌‌‌‌గా విభజించి 86 మంది ఎమ్మెల్యేలకు, 14 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఆయా ఎంపీటీసీ స్థానాల్లో ఏ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటే ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే, మంత్రినే ఇన్‌‌‌‌చార్జిగా వేసింది. ఉదాహరణకు గిరిజన ఓటర్లు అత్యధికంగా ఉండే సంస్థాన్ నారాయణపురం మండలంలోని పొర్లగడ్డ తండా, రాధానగర్ తండా, మర్రిబావి తండాల బాధ్యతలను మంత్రి సత్యవతిరాథోడ్‌‌‌‌కు, రెడ్డి ఓటర్లు ఎక్కువగా ఉండే సర్వేల్ యూనిట్‌‌‌‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఇన్​చార్జులుగా నియమించారు. గంగుల కమలాకర్ (నారాయణ్​పూర్), సబితా ఇంద్రారెడ్డి (నాంపల్లి మండలం పసునూరు), మంత్రి జగదీశ్ రెడ్డి (మునుగోడు), పువ్వాడ అజయ్ కుమార్ (మునుగోడు మండలం కొరటికల్), నిరంజన్ రెడ్డి (మర్రిగూడ మండలం డీపీపల్లి), టి.హారీశ్​రావు (మర్రిగూడ), కేటీఆర్ (గట్టుప్పల్), వి.ప్రశాంత్ రెడ్డి (చౌటుప్పల్ మండలం డి.నాగారం), సీహెచ్ మల్లా రెడ్డి (చౌటుప్పల్ మండలం ఆరెగూడెం), వి. శ్రీనివాస్​గౌడ్ (చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 2, 3 వార్డులు), కొప్పుల ఈశ్వర్ (చండూరు మండలం బోడంగిపర్తి), ఎర్రబెల్లి దయాకర్ రావు (చండూరు మున్సిపాలిటీలోని 2,3 వార్డులు)లను ఇన్​చార్జ్ లుగా నియమించారు. మర్రిగూడ మండలం లెంకలపల్లి యూనిట్ ఇన్‌‌‌‌చార్జ్​గా సీఎం కేసీఆర్ వ్యవహరించనున్నారు. ఆయన తరఫున అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి.. లెంకలపల్లిలో సమన్వయం చేయనున్నారు. ఈయనతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా లెంకలపల్లి గ్రామంపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇయ్యాల్టి నుంచి ప్రచారం

మునుగోడుకు ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లుగా నియమితులైన ఎమ్మెల్యేలు, మంత్రులు శుక్రవారం సాయంత్రాని కల్లా తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకొని, ప్రచారం ప్రారంభించాలని పార్టీ హైకమాండ్​ ఆదేశించింది. దీంతో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులతో మునుగోడులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఎన్నికల ఇన్​చార్జులుగా జిల్లా మంత్రి జగదీశ్‌‌‌‌ రెడ్డి, జిల్లా పార్టీ ఇన్​చార్జి రవీందర్​రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి కొనసాగుతున్నారు. 

అభ్యర్థిగా కూసుకుంట్ల?

మునుగోడు టీఆర్ఎస్​ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయన పేరు దాదాపు ఖరారైంది. ఈ మేరకు నామినేషన్‌‌‌‌కు ఏర్పాట్లు చేసుకోవాలని, 7 నుంచి 14 తేదీ మధ్య నామినేషన్ వేయాలని పార్టీ నుంచి ప్రభాకర్​రెడ్డికి ఆదేశాలు అందాయి. శుక్రవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. ఇదే జరిగితే  12 లేదా 14వ తేదీల్లో నామినేషన్ వేసేందుకు ప్రభాకర్​రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.