థింక్​ ఇండియా–థింక్​ రిటెయిల్​ 2022

థింక్​ ఇండియా–థింక్​ రిటెయిల్​ 2022

నైట్​ఫ్రాంక్​ రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ: గత 30 నెలల్లో టాప్​ 8 సిటీలలో కొత్తగా 16 మాల్స్​ లాంఛయినట్లు నైట్​ఫ్రాంక్​ రిపోర్టు తెలిపింది. ఈ మాల్స్​ 15.5 మిలియన్​ చదరపు అడుగుల ప్లేస్​లో ఏర్పాటయినట్లు పేర్కొంది. ఓవైపు కరోనా మహమ్మారి ఎఫెక్ట్​ ఉన్నప్పటికీ ఇన్ని కొత్త మాల్స్​ లాంఛ్​ అవడం విశేషమని వివరించింది. థింక్​ ఇండియా–థింక్​ రిటెయిల్​ 2022 పేరిట ఒక రిపోర్టును నైట్​ఫ్రాంక్​ తీసుకొచ్చింది. కొవిడ్​19కి ముందు అంటే డిసెంబర్​ 2019 నాటికి దేశంలో 255 మాల్స్​ ఉన్నాయి. అహ్మదాబాద్​, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్​, కోల్​కత, ముంబై, ఎన్​సీఆర్​, పుణె సిటీలలో 77.4 మిలియన్​ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్స్​ ఏర్పాటయ్యాయి. 2022 జూన్​ చివరి నాటికి (అంటే మొదటి ఆరు నెలల్లో) మాల్స్​ విస్తీర్ణం మొత్తం 92.9 మిలియన్​ చదరపు అడుగులకి చేరినట్లు రిపోర్టు తెలిపింది. దేశంలో ఇప్పుడు 271 మాల్స్​ ఆపరేషన్స్​లో ఉన్నట్లు పేర్కొంది. మొత్తం మాల్స్​లో ఎన్​సీఆర్​ వాటా 34 శాతమని, ముంబై వాటా 18 శాతం, బెంగళూరు వాటా 17 శాతమని వివరించింది. రియల్​ ఎస్టేట్​ సెక్టార్​ మెచ్యూర్​ అయిందని, చిన్న సైజు డెవలప్​మెంట్​ ప్రాజెక్టులలోనూ గ్రేడ్​ ఏ మాల్స్​ ఏర్పాటవడమే దీనికి నిదర్శనమని నైట్​ఫ్రాంక్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ శిశిర్​ బైజాల్​ చెప్పారు. భవిష్యత్​లో రిటెయిల్​ రియల్​ ఎస్టేట్​కు మంచి గ్రోత్​ వస్తుందని, రీట్స్​(రియల్​ ఎస్టేట్​ ఇన్వెస్ట్​మెంట్​ ట్రస్ట్) సహా పెట్టుబడి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. 

ఏ గ్రేడ్​ మాల్స్​ 39 శాతమే...

మన దేశంలోని మొత్తం మాల్స్​లో 39 శాతం మాత్రమే ఏ గ్రేడ్​ మాల్స్​గా గుర్తింపు పొందినట్లు నైట్​ఫ్రాంక్​ రిపోర్టు వెల్లడించింది. 36 మిలియన్​ చదరపు అడుగుల గ్రాస్​ లీజింగ్​ ఏరియా ఉంటే వాటిని గ్రేడ్​ ఏ మాల్స్​గా పరిగణిస్తారు. టాప్​ 8 సిటీలలోనూ కలిపి 52 గ్రేడ్​ ఏ మాల్స్​ ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. గ్రేడ్​ బీ కేటగిరీలో మొత్తం 94 మాల్స్​, గ్రేడ్​ సీ కేటగిరీలో 125 మాల్స్​ ఉన్నాయి. దేశంలో మాల్స్​ డెవలప్​ చేసే డెవలపర్ల సంఖ్య 33కి తగ్గిపోయిందని తెలిపింది. 2010 కంటే ముందు 120 మంది దాకా రిటెయిల్​ రియల్​ ఎస్టేట్​ డెవలపర్లు ఉండేవారని వెల్లడించింది.

మాల్స్​ సేల్స్​ 29 శాతం పెరుగుతయ్​..

దేశంలోని షాపింగ్​ మాల్స్​ సేల్స్​ 29 శాతం గ్రోత్​తో 2028 నాటికి 39 బిలియన్​ డాలర్ల మార్కును దాటుతాయని కూడా నైట్​ఫ్రాంక్​ రిపోర్టు అంచనా వేసింది. కన్జంప్షన్​ పెరగడంతోపాటు, కొత్త మాల్స్​నూ లెక్కలోకి తీసుకుని ఈ అంచనా వేసినట్లు వివరించింది. టాప్​ 8 సిటీలలో ఆర్గనైజ్డ్​ రిటెయిల్​ సేల్స్​ఏటా 17 శాతం చొప్పున పెరిగి 2028 నాటికి ఏకంగా 136  బిలియన్​ డాలర్లవుతాయని కూడా నైట్​ఫ్రాంక్​ రిపోర్టు అంచనా వేస్తోంది.  రాబోయే ఆరేళ్లలో కొత్తగా 50–55 మిలియన్​ చదరపు అడుగుల ప్లేస్​లో మాల్స్​ రానున్నట్లు నైట్​ఫ్రాంక్​ డైరెక్టర్​ వివేక్​ రాఠి చెప్పారు.