ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో రాష్ర్ట ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యానిఫ్యాక్చరింగ్(ఎన్సీఏఎం) కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేశ్కుమార్ శర్మ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడానికి ఎలక్ట్రానిక్స్, ఆరోగ్యం సహా వాటి అనుబంధ రంగాల్లో మరింత వృద్ధికి అద్భుతమైన అవకాశం ఉందని తెలిపారు.
పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ సహకారం, సమష్టి కృషి ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తికి వన్ బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారాన్ని జోడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. దేశానికి ఆడిటివ్ మ్యానిఫ్యాక్చరింగ్ ఒక ముఖ్యమైన మైలురాయి అని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని తయారీ రంగాన్నే ఇది మార్చి వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

