
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2023 జూలై 15 శనివారం తెల్లవారుజామున నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కులు-మనాలి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. ఈరోజు కురిసే వర్షాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. రెండ్రోజుల క్రితం కురిసిన వర్షాలు, వరదలతో సుమారు 7300 టూరిస్ట్ వాహనాలు 19 గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో భారత వాతవారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 2023 జులై 13 నుంచి 17 వరకు ఆ రాష్ట్రమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జులై 19 వరకూ ఆ రాష్ట్రంలో తడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని తెలిపింది.
హిమాచల్ లో ఇప్పటివరకు 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 636 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 1,128 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,110 రోడ్లు బ్లాక్ అయ్యాయని ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.