
భద్రాచలం,వెలుగు:ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితుల పరిహారంలో అవకతవకలకు సంబంధించి ప్రాథమిక విచారణ జరిపిన కోర్టు కలెక్టర్ తో పాటు 11 మందికి నోటీసులు ఇచ్చింది. జూన్ 14న కోర్టు ముందు హాజరుకావాలని వారికి సమన్లు జారీ చేసింది. మణుగూరు ఏరియాలోని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టు భూ నిర్వాసితుల పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకలపై మణుగూరు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. నిర్వాసితులను ప్రాథమికంగా విచారించిన మణుగూరు మెజిస్ట్రేట్ ఎన్.శ్యాంసుందర్ కేసును నమోదు చేసి విచారణకు ఆదేశించి, సమన్లు జారీ చేశారు. నిర్వాసితుల ఆందోళనపై పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సుమోటోగా స్వీకరించింది. గతంలో సింగరేణి, రెవిన్యూ అధికారులకు నోటీసులు ఇచ్చింది.
ఫిబ్రవరి 28న క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కందిమళ్ల నర్సింహారావు, మరికొంత మంది రైతులు తమతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని చెక్కులు ఇచ్చారని సంస్థ కార్యదర్శి కి వివరించారు. జిల్లా న్యాయసేవా సంస్థ ఆదేశాలతో మండల న్యాయసేవ న్యాయవాది కె.నర్సింహారావు కారం మల్లమ్మతో పాటు మరో 22 మంది నిర్వాసితుల పక్షాన పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్ రజత్‍కుమార్ షైనీ, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, సింగరేణి డైరక్టర్ (పా) చంద్రశేఖర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొంటూ కేసు వేశారు. పరిహారం చెల్లించకుండా భూములను ఆక్రమించుకుని పంట పొలాల్లో మట్టి పోయడంతో పాటు తమను భయపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు వేయడంతో ముద్దాయిలుగా పేర్కొంటున్న అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది .