నార్త్ అమెరికా, నార్త్ ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికాకు పెరిగిన ఎగుమతులు

నార్త్ అమెరికా, నార్త్ ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికాకు పెరిగిన ఎగుమతులు
  • మొత్తం  సరుకుల ఎగుమతుల్లో ఈ ప్రాంతాల వాటా 35 శాతం

న్యూఢిల్లీ: భారతదేశ సరుకుల ఎగుమతులు 2025-–26 ఆర్థిక సంవత్సరంలో 441.78 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో  నార్త్‌‌‌‌ అమెరికా, నార్త్ ఈస్ట్ ఏషియా,  లాటిన్ అమెరికా ప్రాంతాల వాటా 35 శాతానికి చేరింది. కామర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం,   ఉత్తర అమెరికాకు  కిందటి ఆర్థిక సంవత్సరంలో 97.7 బిలియన్ డాలర్ల  ఎగుమతులు జరిగాయి. ఏడాది లెక్కన కేవలం ఒక శాతం మాత్రమే పెరిగాయి. కానీ, మన మొత్తం ఎగుమతుల్లో ఈ ప్రాంతం వాటా 22.1శాతంగా ఉంది. 

చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి  నార్త్ ఈస్ట్ ఏషియా దేశాలకు జరిపిన ఎగుమతులు  21.6శాతం పెరిగి  41.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ప్రాంతం వాటా 9.4శాతంగా ఉంది. లాటిన్ అమెరికాకు ఎగుమతులు 7.8శాతం పెరిగి 16.4 బిలియన్ డాలర్లకు చేరగా,  ఈస్ట్ ఆఫ్రికాకు 13.7శాతం, నార్త్‌‌‌‌ ఆఫ్రికాకు 14.8శాతం చొప్పున ఎగుమతులు పెరిగాయి.  భారతీయ ఎగుమతిదారులు ఈసారి 1,821 కొత్త కమోడిటీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకెళ్లారు. 

అడ్వాన్స్‌‌‌‌డ్ ఇంజనీరింగ్ రంగంలో 'ఓడలు, పడవలు, ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్' విభాగం 19 కొత్త మార్కెట్లలో 57 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అణు రియాక్టర్లు, పారిశ్రామిక బాయిలర్లు (13 కొత్త మార్కెట్లు), టెలికాం పరికరాలు (20 కొత్త మార్కెట్లు), ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ విడిభాగాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బాగా ఎగుమతి అయ్యాయి.