పొరుగు నుంచి కరోనా ముప్పు: మన సరిహద్దు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

పొరుగు నుంచి కరోనా ముప్పు: మన సరిహద్దు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు
  • దేశంలోని రోజువారీ కేసుల్లో సగం మహారాష్ట్రలోనే నమోదు
  • కర్నాటకలో 3వేలు, చత్తీస్‌‌గఢ్‌‌లో 2 వేల మందికి పాజిటివ్‌‌ 
  • ఆంధ్రప్రదేశ్​లోనూ వెయ్యి దాటిన రోజువారీ కేసులు
  • ఆందోళనలో జనం.. బార్డర్‌‌లో టెస్టులు చేయాలంటున్న ఎక్స్‌‌పర్ట్స్‌‌
  • లాక్‌‌డౌన్‌‌ దిశగా మహారాష్ట్ర.. అధికారులు రెడీగా ఉండాలన్న సీఎం థాక్రే


హైదరాబాద్‌‌, వెలుగు: మన పొరుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌‌గఢ్‌‌, ఆంధప్రదేశ్‌‌లలో రోజువారీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోని రోజువారీ కేసులు, మరణాల్లో సగం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కర్నాటక, చత్తీస్‌‌గఢ్‌‌లోనూ రోజూ మూడు వేల మందికిపైనే వైరస్‌‌ సోకుతోంది. పక్క రాష్ట్రం ఏపీలోనూ రోజువారీ కేసులు వెయ్యి దాటుతున్నాయి. తెలంగాణతో నిత్యం రాకపోకలు, వ్యాపారం జరిగే ఈ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. బార్డర్‌‌లో కరోనా టెస్టు సెంటర్లు పెట్టాలని, ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేయాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ సూచిస్తున్నారు. రాష్ట్రంలోనూ రోజువారీ టెస్టులు పెంచాలంటున్నారు.
మహారాష్ట్రలో 40 వేల కేసులు
మహారాష్ట్రలో లాక్‌‌డౌన్‌‌ను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ థాక్రే ఆదేశించారు. ఆర్థికంగా ఎక్కువ నష్టం జరగకుండా ప్లాన్‌‌ రెడీ చేయాలని చెప్పారు. రాష్ట్ర కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒకసారి లాక్‌‌డౌన్‌‌ అమలయ్యాక ప్రజలకు కన్ఫ్యూజన్‌‌ ఉండొద్దని చెప్పారు. మెడిసిన్స్‌‌, రేషన్‌‌ లాంటి అత్యవసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇండస్ట్రీలు 80 శాతం ఆక్సిజన్‌‌‌‌ను మెడికల్‌‌‌‌ అవసరాలకు, 20 శాతాన్ని ఇతరత్రా అవసరాల కోసం ఉత్పత్తి చేయాలన్నారు. ఆదివారం కూడా దాదాపు 40 వేల కేసులు నమోదవడంతో ఆ రాష్ట్ర హెల్త్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ రాజేశ్‌‌‌‌ తోపే, ఆ శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ ప్రదీప్‌‌‌‌ వ్యాస్‌‌‌‌, ఇతర హెల్త్‌‌‌‌ ఆఫీసర్లతో థాక్రే సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు, హెల్త్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై రివ్యూ చేశారు. 

బెడ్లు నిండిపోతున్నయ్‌‌‌‌

కరోనా కేసులు ఇలానే పెరుగుతూ పోతే రాష్ట్రంలో బెడ్స్‌‌‌‌, ఆక్సిజన్‌‌‌‌ సప్లై, వెంటిలేటర్స్‌‌‌‌కు కొరత ఏర్పడుతుందని.. ఆస్పత్రులపై ఒత్తిడి ఎక్కువవుతుందని సీఎంకు ప్రదీప్ వ్యాస్‌‌‌‌ వివరించారు. ప్రస్తుత హెల్త్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై థాక్రేకు ఆయన ప్రజెంటేషన్‌‌‌‌ ఇచ్చారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 3.57 లక్షల ఐసోలేషన్‌‌‌‌ బెడ్స్‌‌‌‌ ఉన్నాయి. ఇందులో 1.07 లక్షల బెడ్స్‌‌‌‌ ఇప్పటికే నిండిపోయాయి. మిగిలిన బెడ్స్‌‌‌‌ కూడా వేగంగా నిండిపోతున్నాయి’ అని వ్యాస్‌‌‌‌ చెప్పారు. 60 వేల ఆక్సిజన్‌‌‌‌ బెడ్స్‌‌‌‌లో దాదాపు 13 వేలు, 9 వేల వెంటిలేటర్లలో దాదాపు 2 వేలు నిండిపోయాయన్నారు. కొన్ని జిల్లాల్లో బెడ్స్‌‌‌‌ ఖాళీ లేవని చెప్పారు. 

రోజుకు 10 శాతం

రాష్ట్రంలో కేసులు రోజుకు 10 శాతం పెరుగుతున్నాయని మంత్రి తోపే చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో బెడ్స్‌‌‌‌ సరిపోవట్లేదన్నారు. షార్ట్‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌, ఈ ఐసీయూ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా కాస్త ఒత్తిడి తగ్గుతోందని వివరించారు. కోల్డ్‌‌‌‌ చైన్‌‌‌‌ ఫెసిలిటీస్‌‌‌‌ను పెంచినట్టయితే గ్రామాల్లో కూడా వేగంగా వ్యాక్సిన్‌‌‌‌ వేయొచ్చని చెప్పారు. ప్రస్తుత యాక్టివ్‌‌‌‌ కేసుల్లో ఎక్కువ శాతం యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ ఉన్నారన్నారు. మహారాష్ట్రలో మున్ముందు రోజుకు 40 వేలకు పైనే కేసులు నమోదవొచ్చని, కేసులు పెరగకుండా కఠినమైన లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ అమలు చేయాలని సీఎంకు  కొవిడ్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ సూచించింది.  

నైట్‌‌‌‌ కర్ఫ్యూ, ఆంక్షలు

కేసులు పెరుగుతున్నా ప్రజలు కరోనా రూల్స్‌‌‌‌ పాటించట్లేదని హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ చెప్పింది. ప్రైవేటు సంస్థలు కూడా 50 శాతం అటెండెన్స్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పాటించట్లేదంది. దీని వల్లే కేసులు స్పీడ్‌‌‌‌గా పెరుగుతున్నాయని తెలిపింది. కేసులు పెరుగుతుండటంతో కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్‌‌‌‌ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేస్తోంది. మతపర, ఇతర సామూహిక కార్యక్రమాలను మార్చి 27 నుంచి బ్యాన్‌‌‌‌ చేసింది. రెస్టారెంట్లు, గార్డెన్స్‌‌‌‌, బార్లను రాత్రి 8 గంటల నుంచి పొద్దున 7 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశించింది.  

ఏపీలో ఒక్కరోజే వెయ్యి

ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కరోనా మరోసారి విరుచుకుపడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,005 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గుంటూరులో 225, విశాఖపట్నంలో 167, కృష్ణాలో 135 మందికి వైరస్‌‌‌‌ సోకింది. నవంబర్‌‌‌‌ 26 తర్వాత కేసులు మళ్లీ వెయ్యి దాటడం ఇదే తొలిసారని ఆ రాష్ట్ర హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,95,920కి చేరిందని.. 5,394 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇప్పటివరకు 8.83 లక్షల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారంది. గత 24 గంటల్లో చిత్తురులో ఒకరు, కృష్ణాలో ఒకరు కరోనాతో మరణించారని తెలిపింది. ఇప్పటివరకు కరోనాతో 7,205 మంది చనిపోయారంది. రాష్ట్రవ్యాప్తంగా 1.49 కోట్ల శాంపిల్స్‌‌‌‌ పరీక్షించినట్టు వెల్లడించింది.

కర్నాటకలో 3 వేలు

కర్నాటకలో గత 24 గంటల్లో 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే 2,004 కేసులున్నాయి. ఉడుపిలో 115, మైసూరులో 114, దక్షిణ కన్నడలో 68, హాసన్‌‌‌‌లో 65, బీదర్‌‌‌‌లో 63, ధార్వాడ్‌‌‌‌లో 60 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత నవంబర్‌‌‌‌లో 3,156 కేసులు రికార్డవగా మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 9.87 లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం 23 వేల యాక్టివ్‌‌‌‌ కేసులున్నాయి. ఇందులో 204 మంది ఐసీయూలో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పొందుతున్నారు. మిగతా 22 వేల మంది ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో బెంగళూరు అర్బన్‌‌‌‌లో కేసులు, మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అక్కడ ఇప్పటివరకు 4.28 లక్షల కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.11 కోట్ల శాంపిల్స్‌‌‌‌ను టెస్టు చేశారు. ఆదివారం లక్ష శాంపిల్స్‌‌‌‌ పరీక్షించారు.  

ఛత్తీస్‌‌‌‌లో 2 వేలకు పైనే

ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో గత రెండ్రోజుల్లోనే 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,153 మందికి వైరస్‌‌‌‌ సోకినట్టు అక్కడి హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 3.4 లక్షలు దాటాయంది. ఒక్క రోజే 15 మంది చనిపోయారని, మొత్తం మరణాలు  4,076కు చేరాయని వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19 వేలకు పైగా యాక్టివ్‌‌‌‌ కేసులు ఉన్నాయంది. గత 24 గంటల్లో అత్యధికంగా రాయ్‌‌‌‌పూర్‌‌‌‌లో 371 కేసులు రికార్డయ్యాయని చెప్పింది.'