దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా–ఎకు తొలి ఓటమి ఎదురైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (84), రుతురాజ్ గైక్వాడ్ (66), తిలక్ వర్మ (66) హాఫ్ సెంచరీలతో మెరిసినా.. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండియా 4 రన్స్ (డక్‌వర్త్ లూయిస్) స్వల్ప తేడాతో అఫ్గానిస్తాన్–ఎ చేతిలో పరాజయంపాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో.. టాస్ ఓడిన ఇండియా 49 ఓవర్లలో 349/9 స్కోరు చేసింది.
వైభవ్ సూర్యవంశీ (44), ప్రభ్‌సిమ్రన్ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 74 రన్స్ జోడించారు. తర్వాత ప్రభ్‌తో జతకలిసిన రుతురాజ్, తిలక్ వర్మ కీలక భాగస్వామ్యాలు జోడించారు. ఈ ముగ్గురు కలిసి 157 రన్స్ జోడించడంతో ఇండియా 245/5 స్కోరుతో నిలిచింది. చివర్లో సూర్యాన్ష్ షెడ్జే (40) మెరుపు బ్యాటింగ్ చేశాడు. తిలక్‌తో కలిసి ఆరో వికెట్‌కు 70 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇండియా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఫర్మానుల్లా సఫీ 3 వికెట్లు తీశాడు.
ఇండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో అఫ్గాన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 రన్స్‌గా నిర్దేశించారు. ఛేదనలో అఫ్గానిస్తాన్ 25.5 ఓవర్లలో 177/2 స్కోరు చేసింది. ఈ దశలో మళ్లీ భారీ వర్షం పడటంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం అఫ్గాన్ 4 రన్స్ ఎక్కువగా చేసి ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. ఇమ్రాన్ (75 నాటౌట్), బహిర్ షా (51 నాటౌట్) రాణించారు.
