భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ (Press Freedom) తీవ్ర సంక్షోభంలో పడిందని అంతర్జాతీయ సంస్థ 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' (RSF) హెచ్చరించింది. రాజకీయ నాయకుల ఆధిపత్యం, మీడియా సంస్థలు కేవలం కొందరి చేతుల్లోనే ఉండటం ఇంకా జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఈ నివేదికలో పేర్కొంది.
ర్యాంకింగ్స్‌లో వెనకడుగు
ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛను పరిశీలించగా, 100 దేశాలలో పరిస్థితులు దిగజారాయి. దురదృష్టవశాత్తూ మన దేశం కూడా ఈ లిస్టులో ఉంది. భారత్ స్థానం గత ఏడాది 151వ స్థానంలో ఉండగా.... ఇప్పుడు 157వ స్థానానికి పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్నా, జర్నలిస్టులు పని చేయడానికి భారత్ అత్యంత కష్టతరమైన దేశంగా మారుతోందని RSF అభిప్రాయపడింది.
మీడియా ఎక్కువ.. స్వేచ్ఛ తక్కువ
భారతదేశంలో మీడియా నెట్‌వర్క్ చాలా పెద్దది. దాదాపు 900 టీవీ ఛానెళ్లు, 1,40,000 రిజిస్టర్డ్ పత్రికలు ఉన్నాయి. కానీ, ఈ సంఖ్య చూసి మోసపోవద్దని, వాస్తవానికి వార్తలపై ప్రభుత్వ నియంత్రణ పెరిగిందని నివేదిక చెబుతోంది. రేడియో వార్తలు ఇప్పటికీ పూర్తిగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే ఉన్నాయని పేర్కొంది.
కార్పొరేట్ శక్తుల చేతుల్లో మీడియా
పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మీడియా రంగంలోకి ప్రవేశించడం వల్ల స్వతంత్రంగా వార్తలు రాసే అవకాశం తగ్గిపోతోందని RSF ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఇంకా దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ కుటుంబాలకు మధ్య కుదిరిన ఒక రకమైన 'సయోధ్య' వల్ల జాతీయ మీడియా వారి కంట్రోల్‌లోకి వెళ్లిందని నివేదిక విమర్శించింది.
జర్నలిస్టులకు ప్రాణహాని
జర్నలిస్టులకు భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశంగా మారుతోందని నివేదిక చెబుతుంది. ఏటా సగటున ఇద్దరు లేదా ముగ్గురు జర్నలిస్టులు ఈ వృత్తి కారణంగా హత్యలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించే రిపోర్టర్లపై పోలీసు కేసులు, రాజకీయ దాడులు, బెదిరింపులు, వేధింపులు పెరిగిపోయాయి. ఇంటర్నెట్‌లో స్వతంత్ర జర్నలిస్టులను దేశద్రోహులుగా ముద్ర వేసి వేధించడం ఎక్కువైంది. ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ వారిని టార్గెట్ చేసుకుంటున్నారు.
సున్నిత ప్రాంతాల్లో మరింత కష్టం
కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో లేదా పర్యావరణం, భూ వివాదాల వంటి విషయాలపై వార్తలు రాసే వారికి రక్షణ కరువైందని RSF పేర్కొంది. ఇంకా భద్రతా దళాల నిఘా, వేధింపులు, అకారణంగా జైలుకు పంపే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని వివరించింది.

