బార్డర్ దేశాలకు ఎఫ్డీఐ రూల్స్ సడలింపు

బార్డర్ దేశాలకు ఎఫ్డీఐ రూల్స్ సడలింపు
  • కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
  • కఠిన నిబంధనలు సవరించి.. పెట్టుబడులకు మార్గం సుగమం
  • 10% లోపు ఇన్వెస్ట్​మెంట్​కు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు
  • వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి దోహదం
  • టెక్నాలజీ, స్కిల్స్ పెరిగే చాన్స్.. ఉద్యోగ, ఉపాధి వృద్ధికి అవకాశం


న్యూఢిల్లీ: సరిహద్దు దేశాల నుంచి వచ్చే ఫారిన్​ డైరెక్ట్​ ఇన్వెస్టిమెంట్స్ (ఎఫ్​డీఐ)కు సంబంధించి కేంద్ర కేబినెట్ నిబంధనలు సడలించింది. ఇప్పటి వరకు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, అఫ్గనిస్తాన్ నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఇప్పుడా నిబంధనను తొలగించారు. మంగళవారం ఢిల్లీలోని సౌత్​ బ్లాక్ లో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 2020లో కరోనా సమయంలో భారత కంపెనీలను ఆదుకునేందుకు తీసుకొచ్చిన ‘‘ప్రెస్ నోట 3” రూల్స్ ను​ సవరించినట్టు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం అయ్యింది. పరిశ్రమల అభివృద్ధికి, వాణిజ్యం పెరుగుదలకు ఇది ఎంతో దోహదం చేయనుంది. దేశంలో స్టార్టప్​లకు ఇందోక పెద్ద అడ్వాంటేజ్​ను ఇస్తుంది. ఫారిన్​ కంపెనీలు కొత్త టెక్నాలజీ, బెటర్ స్కిల్స్ దేశంలో ప్రవేశపెడతాయి. అలాగే ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వేగవంతం అవుతుంది. భారత్​ మొత్తం ఎఫ్​డీఐలో చైనా కేవలం 0.32 శాతం (సుమారు 2.51 బిలియన్ల డాలర్లు) పెట్టుబడులతో 23వ స్థానంలో ఉంది. అయినప్పటికీ 2024-25లో చైనా నుంచి దిగుమతులు 113.45 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. వాణిజ్య లోటు 99.2 బిలియన్ల డాలర్లకు విస్తరించింది.

జల్​జీవన్​ మిషన్​కు భారీగా నిధుల పెంపు

జల్ జీవన్ మిషన్‌‌‌‌ మొత్తం వ్యయాన్ని రూ.8.69 లక్షల కోట్లకు పెంచుతూ.. డిసెంబర్ 2028 వరకు పొడిగించింది. దీన్ని మౌలిక వసతుల కల్పన నుంచి సేవల పంపిణికి రీ కన్​స్ట్రక్ట్​ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన సర్వీసు అందించడం కోసం సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సుజల్ గావ్ కింద ప్రతి గ్రామానికి ఒక ఐడీ కేటాయించి సప్లై సిస్టం నుంచి నల్లా వరకు తాగునీటి వ్యవస్థ మొత్తాన్ని డిజిటల్ మ్యాప్ చేయనున్నారు. 

ఇంటర్నేషనల్ ​ఎయిర్​పోర్టుగా మదురై విమానాశ్రయం..

తమిళనాడులోని మదురై విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టుగా ప్రకటించారు. ఇది పర్యాటకం, వ్యాపారం మరియు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాకు సమీపంలోని జేవర్ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టుకు 31.42 కి.మీ గ్రీన్‌‌‌‌ఫీల్డ్ కారిడార్‌‌‌‌ కోసం రూ3,630.77 కోట్లు కేటాయించారు. దీంతో సౌత్​ ఢిల్లీ, గురుగ్రామ్​, ఫరీదాబాద్​ నుంచి కనెక్టివిటీ మెరుగు పడుతుంది. బద్నావర్--తిమర్వాణి 80.45 కి.మీ నాలుగు లేన్ల ఎన్​హెచ్​-752డీ కారిడార్‌‌‌‌కు రూ.3,839.42 కోట్లు కేటాయించారు. అలాగే సైంథియా--పాకూర్, సత్రాగచ్చి--ఖరగ్‌‌‌‌పూర్ మధ్య నాలుగో రైల్వే లైన్ల కోసం రూ.4,474 కోట్ల కేటాయింపునకు ఆమోదించారు.