3,026 ఆలయాలకు కేటాయింపు
ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు మంత్రులు
సురేఖ, పొన్నం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాలు జులై 16 నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆగస్టు 13 వరకు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 3,026 ఆలయాలకు ఈ నిధులను కేటాయించింది.
ఈ ఏడాది బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన బోనాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రధాన ఆలయాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, తాగునీటి సౌకర్యం, ప్రసాదాల పంపిణీ, పారిశుధ్య నిర్వహణ, క్యూ లైన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వైద్య శిబిరాలు, అత్యవసర స్పందన వ్యవస్థలు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. మహిళలు ఫ్రీ బస్ తోఅధిక సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని సూచించారు.
గోల్కొండ, బాల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, సబ్జీ మండి, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని.. పోలీసులు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, జీహెచ్ఎంసీ, ఇతర పౌర శాఖలు సమగ్ర భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ దయానంద్, డీజీపీ సీవీ ఆనంద్, ఎండోమెంట్ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, సీపీ సజ్జనార్ పాల్గొన్నారు.
బోనాల షెడ్యూల్ ఇలా..
జులై 16న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు ప్రారంభం (ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ)
జులై 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, రథోత్సవం
ఆగస్టు 2, 3 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, రంగం, అంబారీ ఊరేగింపు
ఆగస్టు 9న పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో పట్టువస్త్రాల సమర్పణ
ఆగస్టు 10న హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి బోనాలు
