ఓఐసీ కామెంట్లు సరికాదు

ఓఐసీ కామెంట్లు సరికాదు

న్యూఢిల్లీ : మనదేశంలో ఇస్లాంపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ది ఆర్గనైజేషన్​ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్(ఓఐసీ) చేసిన కామెంట్లను విదేశాంగ శాఖ ఖండించింది. ఈ కామెంట్లు సంకుచితత్వంతో కూడుకుని ఉన్నాయని, ఇవి సరికాదని పేర్కొంది. మహ్మద్​ ప్రవక్తను ఉద్దేశించి బీజేపీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరి కామెంట్లను ప్రస్తావిస్తూ.. ఇండియాలో ఇస్లాంపై దాడులుపెరిగిపోతున్నాయని ఓఐసీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో ఓఐసీ కామెంట్లను తిరస్కరిస్తున్నామని, అవి సంకుచితత్వంతో కూడుకుని ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి పేర్కొన్నారు. మరోవైపు, మైనార్టీల హక్కుల ఉల్లంఘన విషయంలో పాకిస్తాన్​ కామెంట్లను ఇండియా తప్పుబట్టింది. అసలు మైనార్టీల హక్కులను ఎక్కువగా కాలరాసేదే పాకిస్తాన్​ అని, అది ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడింది. కాగా, మహ్మద్​ ప్రవక్తను కించపరిచేలా కామెంట్లు చేసిన నుపుర్​ శర్మను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం ఢిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.