పెట్టుబడులకు ఇండియానే మంచిదంట

పెట్టుబడులకు ఇండియానే మంచిదంట

ముంబైవీఛాట్ మెసెంజర్ యాప్‌‌గా గుర్తింపు పొందిన చైనీస్ ఇంటర్నెట్ కంపెనీ టెన్సెంట్ హోల్డింగ్స్‌‌ ఫోకస్‌‌ అంతా ప్రస్తుతం ఇండియాపై పడింది. తన స్వదేశంలోని వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ నెమ్మదించడంతో, ప్రస్తుతం ఇండియన్ టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌మెంట్లు పెట్టడం కోసం చూస్తోంది. ఇప్పటికే ఇండియాలో అతిపెద్ద స్టార్టప్‌‌లైన ఫ్లిప్‌‌కార్ట్, ఓలా, స్విగ్గీ, బైజూస్ క్లాసెస్‌‌ వంటి వాటిల్లో టెన్సెంట్ పెట్టుబడులు పెట్టి ఉంది. ఈ ఏడాది కూడా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ నియోకు టెన్సెంట్ పెట్టుబడులు ఇచ్చింది. ప్రస్తుతం వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ఎంఎక్స్ ప్లేయర్, రీజనల్ లాంగ్వేజ్ కంటెంట్ స్టార్టప్ షేర్‌‌‌‌ఛాట్, ఆన్‌‌లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్‌‌ప్లేస్ పాలసీ బజార్, పేమెంట్స్ యాప్ ఫోన్‌‌పే వంటి పలు కంపెనీలతో టెన్సెంట్ చర్చలు జరుపుతున్నట్టు పలు మీడియా రిపోర్ట్‌‌లు పేర్కొన్నాయి.  ఈ విషయంపై మాత్రం టెన్సెంట్ ఇంకా స్పందించలేదు. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ గానా.కామ్‌‌లో కూడా మరో 30 మిలియన్ డాలర్లు(రూ.207 కోట్లు) ఇన్వెస్ట్ చేయాలని కూడా చూస్తున్నట్టు తెలిపాయి. గతేడాది ఫిబ్రవరిలోనే గానా.కామ్‌‌లో తొలి రౌండ్ ఫండ్ కింద రూ.793 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. కంటెంట్ స్టార్టప్స్‌‌లో పెట్టుబడుల విషయం తుది దశకు చేరుకున్నట్టు దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు.

టెన్సెంట్‌‌కు చైనాలో వ్యాపారాలు మందగించాయి. గత ఆరు నెలల నుంచి టెన్సెంట్ ఇన్వెస్ట్‌‌మెంట్లు, వాల్యుయేషన్స్, డీల్స్‌‌ చాలా వరకు తగ్గిపోయినట్టు తెలిసింది. టెన్సెంట్‌‌తో పాటు ఇతర చైనీస్ ఇన్వెస్టర్లు కూడా అక్కడ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో టెన్సెంట్‌‌తో పాటు ఇతర ఇన్వెస్టర్లు ఇండియా వైపు చూస్తున్నట్టు ఓ ఇండియన్ వెంచర్ క్యాపిటలిస్ట్ చెప్పారు. టెన్సెంట్ 2014 నుంచి ఇండియన్ స్టార్టప్‌‌లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. 2014 నుంచి 2018 ఫిబ్రవరి వరకు టెన్సెంట్ ఏడు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. దీనిలో ఫ్లిప్‌‌కార్ట్, బైజూస్, హైక్ మెసెంజర్ ఉన్నాయి. గతేడాది నుంచి అయితే ఐదు కంపెనీలతో సరికొత్తగా డీల్స్‌‌ కుదుర్చుకుంది. టెన్సెంట్ డీల్స్ కుదుర్చుకున్న కంపెనీల్లో డ్రీమ్ 11, స్విగ్గీ లాంటి (యూనికార్న్‌‌) బిగ్ స్టార్టప్‌‌లున్నాయి.ప్రస్తుతం ఆరు కంపెనీలతో టెన్సెంట్ చర్చలు జరుపుతోంది. ‘చైనా వెంచర్ మార్కెట్ 5 నుంచి 7 ఏళ్ల పాటు డ్రీమ్ మార్కెట్‌‌గా కొనసాగింది. ఈ ఏడాది అక్కడ పరిస్థితి మారిపోయింది. అత్యధికంగా వృద్ధి సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. ఇదే సమయంలో ఇండియన్ వెంచర్ ఎకో సిస్టమ్ అత్యధిక గ్రోత్‌‌ను ఆఫర్ చేస్తోంది’ అని ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా సీఈవో ఆశిష్ శర్మ చెప్పారు.  చాలా మంది ఇన్వెస్టర్లు ఇండియా వైపు ఆసక్తి చూపడం తాము చూసినట్టు పేర్కొన్నారు. చైనీస్ టెక్నాలజీ స్టార్టప్స్‌‌ డీల్స్ కుదుర్చుకునే విషయంలో గత మూడేళ్లలో తొలిసారి ఈ క్వార్టర్‌‌‌‌లో మందగించాయి. డిసెంబర్‌‌‌‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 713 వీసీ(వెంచర్ క్యాపిటల్) డీల్స్ మాత్రమే కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 25 శాతం తక్కువ. ఈ క్వార్టర్‌‌‌‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం 12 శాతం తగ్గి 18.3 బిలియన్ డాలర్లుగా(రూ.1,26,356 కోట్లు)నమోదైంది.