
- బ్యాటింగ్‌లో ఫెయిలవుతున్న కేఎస్
- ఇషాన్‌కు కీపింగ్ ఎక్స్‌పీరియెన్స్ తక్కువ
న్యూఢిల్లీ: రెండుసార్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో విఫలమైన ఇండియా టీమ్ ఇప్పుడు వెస్టిండీస్ టూర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం అవుతుండటంతో ఆరంభం నుంచే మంచి విజయాలు సాధించాలని పక్కా ప్లాన్స్‌ను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా బ్యాటర్లు, బౌలర్లతో పాటు సరైన కీపర్లను కూడా ఎంపిక చేయాలని భావిస్తోంది. కరీబియన్ టూర్ నుంచే దీనిని మొదలుపెట్టాలని చూస్తోంది. కారు యాక్సిడెంట్‌తో రిషబ్ పంత్ టీమ్‌కు దూరం కావడంతో టెస్ట్‌ల్లో అసలైన వికెట్ కీపర్ ఇంతవరకు లభించలేదు. ఫస్ట్ చాయిస్ కీపర్‌గా తెలుగు కుర్రాడు కోనా శ్రీకర్ భరత్‌కు చాన్స్ ఇచ్చినా అతను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోరంగా ఫెయిలయ్యాడు. ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 18.42 యావరేజ్‌తో కేవలం 129 రన్స్ చేయడంతో అతని బ్యాటింగ్ ఫామ్‌పై ఆందోళన కొనసాగుతున్నది. అయితే కీపింగ్‌లో అతను మెరుగ్గా ఉన్నాడు. పంత్‌ను తలపించేలా మెరుపు స్టంపింగ్‌లతో పాటు అద్భుతమైన క్యాచ్‌లను కూడా తీసుకున్నాడు. కానీ ఈ ఒక్క నైపుణ్యం అతన్ని కొనసాగించడానికి
సరిపోవడం లేదు. బ్యాటింగ్‌లో ఇషాన్ సూపర్
ఐపీఎల్‌లో చెలరేగిన జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను టెస్ట్‌ల్లోకి తీసుకోవాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఇషాన్‌కు తిరుగులేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లతో పోటీపడి షాట్స్ కొట్టగల సమర్థుడు. ఓపెనింగ్ కూడా చేయడం అతనికి ఉన్న అతిపెద్ద బలం. అయితే వికెట్ల వెనకాల మాత్రం ఇషాన్ చాలా బలహీనంగా ఉన్నాడు. షార్ట్ ఫార్మాట్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా, లాంగ్ ఫార్మాట్‌లో అతను ఎక్కువసేపు కీపింగ్ చేయలేడని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విండీస్‌లో టాప్ క్లాస్ బౌలర్లు లేకపోవడంతో ఇషాన్‌ను తీసుకుంటే కీపర్ కమ్ బ్యాటర్‌గా టీమ్‌లో కుదురుకుంటాడని యోచిస్తున్నారు. ఇప్పటికే ఇషాన్ ఎన్‌సీఏ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ క్యాంప్‌లో పాల్గొంటున్నాడు.
సాహాకు నో చాన్స్
బీసీసీఐ ప్లాన్స్‌లో వృద్ధిమాన్ సాహాకు అసలు చాన్సే లేదు. వయసు పరంగా అతను రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉండటంతో యంగ్‌స్టర్స్‌ను తీసుకోవాలని బోర్డు ఆలోచిస్తున్నది. దీంతో యూపీ వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఉపేంద్ర యావరేజ్ 45.02గా ఉంది. లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 42.31. ఈ రెండు గణాంకాలను పరిగణనలోకి తీసుకుని విండీస్‌తో టూర్‌కు ఉపేంద్రకు చాన్స్ ఇవ్వాలని మాజీలు కోరుతున్నారు.