ఇండియాకు నాయకత్వం కావాలి మౌనం కాదు

ఇండియాకు  నాయకత్వం కావాలి మౌనం కాదు

 

  •     గల్ఫ్ సంక్షోభంపై చర్చకు విపక్షాల డిమాండ్
  •     ప్రతిపక్ష నేత రాహుల్ సారథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన
  •     పాల్గొన్న ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, ఇతర ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, గల్ఫ్ సంక్షోభంపై పార్లమెంట్ లో చర్చ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. గల్ఫ్ దేశాల్లో వివాదం, భారత ఆర్థిక వ్యవస్థ, విదేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రధాని మోదీ మౌనం సరికాదన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ‘గల్ఫ్ మంటలు, చమురు షాక్, చిక్కుకున్న భారతీయులు’, ‘ఇండియాకు నాయకత్వం కావాలి– మౌనం కాదు’ అనే భారీ బ్యానర్ తో నిరసన తెలిపారు. ఎంపీలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, మాణిక్కం ఠాగూర్, ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. అలాగే ఈ ఆందోళనలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల, ఇతర ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ వాతావరణంతో భారత్ పై తీవ్ర ప్రభావం పడనుందని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఇంధన సంక్షోభంతో పాటు పెట్రో ధరలు రోజురోజుకు పెరుగనున్నాయన్నారు. అందువల్ల ఈ తీవ్రమైన అంశంపై సభలో చర్చకు పట్టుబడుతున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం మౌనం పాటించడంపై మండిపడ్డారు. ఎల్ పీజీ సిలిండర్ ధరలు ఇప్పటికే పెరిగాయని గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయులు అస్థిర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతలకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి తీసుకోవడానికి, భారత పౌరుల భద్రతను నిర్ధారించడానికి దేశానికి నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమన్నారు.

సస్పెండ్ అయిన ఎంపీల ఆందోళన

సోమవారం ఉదయం ఉభయ సభల ప్రారంభానికి ముందు... సస్పెండ్ అయిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదికి వ్యతిరేకంగా పార్లమెంట్ ప్రధాన మార్గం మకర ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. సస్పెండ్ కు గురైన ఎంపీలు చామల, మాణిక్కం ఠాగూర్ తో తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సస్పెన్షన్ తో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను ఆపాలంటూ నినాదాలు చేశారు.

ప్రతిపక్షం గొంతు నొక్కడం 
ప్రజాస్వామ్యాన్ని చంపడమే: వంశీకృష్ణ

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా జరుగుతున్న పరిణామాలపై గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చించే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షం గొంతు నొక్కడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక పాత్ర అన్నారు. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన అనేక మంది భారతీయులు ప్రస్తుతం యుద్ధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం పాటించడం సరికాదన్నారు. అక్కడున్న భారతీయుల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేయడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే అన్ని వర్గాల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలన్నారు.