తుర్కియే సంస్థ ‘సెలెబీ’పై వేటు.. ఆ దేశ వర్సిటీలతో జామియా కూడా కటీఫ్

తుర్కియే సంస్థ ‘సెలెబీ’పై వేటు.. ఆ దేశ వర్సిటీలతో జామియా కూడా కటీఫ్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్తాన్‌‌కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లను సైతం అందించిన తుర్కియేకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్ ఎయిర్ పోర్టుల్లో తుర్కియేకి చెందిన 'సెలెబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్' సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ ను గురువారం రద్దు చేసింది.  జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భారత విమానాశ్రయాల భద్రతను మరింత బలోపేతం చేయడంతోపాటు విదేశీ సంస్థల కార్యకలాపాలపై పటిష్టమైన నిఘాను పెంచడంలో భాగంగా సెలెబీపై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. 

సెలెబీ సంస్థ మన దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు, ఇతర సాంకేతిక సేవలను అందిస్తోంది. ఆపరేషన్ సిందూర్ టైంలో ఈ సంస్థ కొన్ని అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుకూడా భావిస్తున్నారు. కాగా.. తుర్కియే వర్సిటీలతో ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ కూడా ప్రకటించింది. ఢిల్లీలోని జేఎన్‌‌యూ కూడా  తుర్కియేకు చెందిన ఇనోను వర్సిటీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఇదివరకే ప్రకటించింది.