CWG 2026: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా స్ప్రింటర్లు దిలీప్ మహదు గవిత్, మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్లాస్గోలోని స్కాట్‌స్టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్ రేసులో ఈ ఇద్దరు అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శనతో కామన్వెల్త్ క్రీడల వేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది.
దిలీప్ గవిత్ ఆల్‌టైమ్ రికార్డు.. బాసిల్ అద్భుత అరంగేట్రం:
ఈ పోటీలో మహారాష్ట్రకు చెందిన దిలీప్ గవిత్ కేవలం 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఈ విభాగంలో ఇది ఆల్‌టైమ్ రికార్డు టైమింగ్ కావడం విశేషం. మరోవైపు కేరళకు చెందిన 21 ఏళ్ల మహమ్మద్ బాసిల్ 10.83 సెకన్లలో రేసును ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న తొలి టోర్నీలోనే బాసిల్ పతకం సాధించడం విశేషం.
బాసిల్ పై ప్రతీకారం తీర్చుకున్న దిలీప్:
మే 2026లో బెంగళూరులో జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బాసిల్ 10.63 సెకన్లతో స్వర్ణం గెలవగా, దిలీప్ గవిత్ 10.64 సెకన్లతో కేవలం ఒక్క మైక్రో సెకన్ తేడాతో రజతంతో సరిపెట్టుకున్నాడు. కానీ కామన్వెల్త్ గేమ్స్ 2026 వేదికపై మాత్రం దిలీప్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
400 మీటర్ల స్పెషలిస్ట్ నుంచి 100 మీటర్ల ఛాంపియన్‌గా:
దిలీప్ గవిత్ సాధించిన ఈ విజయం ఆయనలోని బహుముఖ సామర్థ్యాన్ని చాటిచెబుతోంది. అంతర్జాతీయ స్థాయిలో 400 మీటర్ల రేసు స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన దిలీప్, 2022 హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో 400m T47 విభాగంలో స్వర్ణం సాధించాడు. అయితే ఈసారి తక్కువ దూరపు 100m రేసులోకి ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే పసిడిని సొంతం చేసుకోవడం విశేషం.
భారత్ పతకాల పట్టికలో దూకుడు:
2026 కామన్వెల్త్ గేమ్స్‌లో దిలీప్ గవిత్ సాధించిన పసిడి భారత్‌కు మూడో స్వర్ణ పతకం. అంతకుముందు ప్రియాంక ధంకర్, మీరాబాయి చానులు భారత్‌కు పసిడి పతకాలు అందించారు. అలాగే బాసిల్ సాధించిన రజతం ఈ టోర్నీలో భారత్‌కు 9వ సిల్వర్ మెడల్. పురుషుల లాంగ్ జంప్‌లో మురళి శ్రీశంకర్ రజతం సాధించిన కొద్ది నిమిషాల్లోనే బాసిల్ కూడా మెడల్ గెలవడంతో భారత క్రీడాభిమానుల్లో ఉత్సాహం నిండింది.
𝗧𝗛𝗥𝗘𝗘 𝗠𝗢𝗥𝗘 𝗠𝗘𝗗𝗔𝗟𝗦 𝗧𝗢 𝗧𝗔𝗞𝗘 𝗢𝗨𝗥 𝗧𝗔𝗟𝗟𝗬 𝗧𝗢 1️⃣5️⃣! 🔥🇮🇳
— Royal Challengers Bengaluru (@RCBTweets) July 30, 2026
🥇 𝗗𝗶𝗹𝗶𝗽 𝗚𝗮𝘃𝗶𝘁: Gold in Men's 1️⃣0️⃣0️⃣m T47. First-ever Indian male CWG Para Athletics gold, a Games record time of 1️⃣0️⃣.7️⃣1️⃣s, on his CWG debut. 👏
🥈 𝗠𝗼𝗵𝗮𝗺𝗺𝗲𝗱 𝗕𝗮𝘀𝗶𝗹: Silver… pic.twitter.com/j9i0JGTU01
