- యంగ్ స్టర్స్ కు సూపర్ చాన్స్
- రా.7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో లైవ్
రాంచీ: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న టీమిండియా.. టీ20 సిరీస్ కోసం రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు రెండు వారాలే టైమ్ ఉండటం, వరల్డ్‌కప్ నేపథ్యంలో వన్డేలతో క్యాలెండర్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే కెప్టెన్ రోహిత్, విరాట్, రాహుల్, షమీ, సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వడంతో ఈ సిరీస్‌లో యంగ్‌స్టర్స్‌ను పరీక్షించాలని టీమిండియా మేనేజ్మెంట్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ సిరీస్‌లో రాణిస్తే వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కించుకునే చాన్స్ ఉండటంతో చాలా మంది కుర్రాళ్లు దీనిపై దృష్టి పెట్టారు. మరోవైపు ఇండియా టూర్లో తొలి గెలుపు కోసం కివీస్ వెయిట్ చేస్తోంది. టాస్ ఎవరు గెలిచినా.. బౌలింగ్‌ను ఎంచుకునే చాన్స్ ఉంది.
కుల్దీపా.. చహలా?
ఈ సిరీస్ కోసం టీమిండియా పెద్దగా ప్రయోగాలు చేయడం లేదు. మొన్న లంకపై సిరీస్ గెలిచిన టీమ్‌ను యధావిధిగా కంటిన్యూ చేయొచ్చు. రంజీల్లో అదరగొట్టిన పృథ్వీ షా టీమ్‌లోకి వచ్చినా ఫైనల్ ఎలెవన్‌లో చాన్స్ కష్టమే. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా రానున్నారు. లైనప్‌లో ‘మిస్టర్ 360’ సూర్య ప్లేస్‌కు ఢోకా లేదు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, హార్దిక్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఏ స్లాట్ ఖాళీగా కనిపించడం లేదు. ఒకవేళ ఇప్పుడున్న ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. త్రిపాఠి ప్లేస్‌లో పృథ్వీకి చాన్స్ దొరుకుతుందేమో చూడాలి. పేస్ బౌలింగ్‌లో శివమ్ మావికి తోడుగా ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ ఫైనల్ ఎలెవన్‌లో ఉండొచ్చు. లంకతో రెండో మ్యాచ్‌లో రెండు ఓవర్లలోనే 37 రన్స్ ఇవ్వడంతో అర్ష్‌దీప్ కాస్త ఆందోళన కలిగించినా ఇప్పుడు కుదురుకున్నాడు. అయితే ఏకైక స్పిన్నర్ స్లాట్ కోసం కుల్దీప్, చహల్ పోటీలో ఉన్నారు. వన్డేల్లో కుల్చా జోడీని ఆడించినా.. టీ20ల్లో ఇద్దర్ని అంటే కష్టమే. ఈ ఫార్మాట్లో అక్షర్ లేకపోవడంతో చహల్ బెస్ట్ అప్షన్. ఓవరాల్‌గా ఈ ఇద్దరిలో ఎవర్ని ఆడిస్తారో టాస్కు ముందు డిసైడ్ చేయనున్నారు.
కాన్వేతో ప్రమాదమే..
వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న న్యూజిలాండ్ ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటంతో షార్ట్ ఫార్మాట్లో కివీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. డేవన్ కాన్వే ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సాంట్నెర్, అలెన్, చాప్మన్, ఫిలిప్స్ చెలరేగితే ఇండియాకు కష్టాలు తప్పవు. మిచెల్, బ్రాస్‌వెల్‌పై దృష్టి పెట్టాల్సిందే. బౌలింగ్‌లో లిస్టెర్ డెబ్యూకు రెడీగా ఉన్నాడు. ఫెర్గుసన్తో కూడా ఇబ్బంది తప్పదు. సోధీ స్పిన్ మ్యాజిక్ పని చేయొచ్చు.
జట్ల అంచనా
ఇండియా: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్య, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్, అర్ష్‌దీప్, కుల్దీప్ / చహల్.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నెర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్‌వెల్, బ్లెయిర్ టిక్నెర్, ఇష్ సోధీ, బెన్ లిస్టెర్, ఫెర్గుసన్.