రెండో టీ20లోనూ ఇండియాదే విజయం.. 2-0తో సిరీస్ సొంతం..

రెండో టీ20లోనూ ఇండియాదే విజయం.. 2-0తో సిరీస్ సొంతం..
  • 90 రన్స్‌‌ తేడాతో ఓడిన జింబాబ్వే
  • చెలరేగిన ఇషాన్‌‌, తిలక్‌‌, అభిషేక్‌‌

హరారే: బ్యాటింగ్‌‌లో ఇషాన్‌‌ కిషన్‌‌ (44 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 81), తిలక్‌‌ వర్మ (29 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 60 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 90 రన్స్‌‌ భారీ తేడాతో జింబాబ్వేపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది.

టాస్‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 219/5 స్కోరు చేసింది. అభిషేక్‌‌ శర్మ (8) ఫెయిలైనా.. వైభవ్‌‌ సూర్యవంశీ.. రిచర్డ్‌‌ ఎంగ్రావ బౌలింగ్‌‌లో 4, 6, 4, 4తో 9 బాల్స్‌‌లోనే 20 రన్స్‌‌ రాబట్టాడు. కానీ మూడు ఓవర్లలోపే ఈ ఇద్దరు పెవిలియన్‌‌కు చేరడంతో ఇండియా స్కోరు 29/2గా మారింది. ఇక్కడి నుంచి ఇషాన్‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడాడు. 23 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ సాధించాడు. మధ్యలో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (25) ఫర్వాలేదనిపించడంతో మూడో వికెట్‌‌కు 64 రన్స్‌‌ జతయ్యాయి.

శ్రేయస్‌‌ ఔటైన తర్వాత వచ్చిన తిలక్‌‌, ఇషాన్‌‌ పోటీపడి బ్యాట్లు ఝుళిపించారు. ముజరబానీ బౌలింగ్‌‌లో హ్యాట్రిక్‌‌ ఫోర్లతో రెచ్చిపోయిన తిలక్‌‌ 23 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 18వ ఓవర్‌‌లో ఇషాన్‌‌ వెనుదిరగడంతో నాలుగో వికెట్‌‌కు 94 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. రింకూ సింగ్‌‌ (12) విఫలమైనా చివరి ఐదు ఓవర్లలో 61 రన్స్‌‌ రావడంతో ఇండియా మంచి స్కోరు చేసింది. ఛేజింగ్‌‌లో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 రన్స్‌‌కే ఆలౌటైంది.

బ్రియాన్‌‌ బెన్నెట్‌‌ (32) టాప్‌‌ స్కోరర్‌‌. మరుమణి (24), రైన్‌‌ బర్ల్‌‌ (20), బ్రాడ్‌‌ ఇవాన్స్‌‌ (19) మోస్తరుగా ఆడారు. స్టార్టింగ్‌‌ నుంచే ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో జింబాబ్వే బ్యాటర్లు రన్స్‌‌ చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దాంతో ఇన్నింగ్స్‌‌లో ఆరుగురు సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. అభిషేక్‌‌ 3, యష్‌‌ ఠాకూర్‌‌, ప్రిన్స్‌‌ యాదవ్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఇషాన్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.