హైదరాబాద్ కంపెనీ స్కైరూట్.. విక్రమ్1’ రాకెట్ ప్రయోగం సక్సెస్

హైదరాబాద్ కంపెనీ స్కైరూట్.. విక్రమ్1’ రాకెట్ ప్రయోగం సక్సెస్

 

  •     నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 
  •     పేలోడ్లను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ 
  •     గ్లోబల్ రాకెట్ లాంచ్ బిజినెస్‌‌‌‌లోకి భారత తొలి ప్రైవేట్ కంపెనీ 
  •     పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రాకెట్‌‌‌‌ తయారీ
  •     ‘మిషన్ ఆగమన్’ పేరుతో చరిత్రాత్మక ప్రయోగం 
  •     స్కైరూట్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోదీ 

శ్రీహరికోట(ఆంధ్రప్రదేశ్): భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ తన తొలి ప్రయాణంలోనే అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌‌‌‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ పేలోడ్‌‌‌‌లను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. శనివారం మధ్యాహ్నం12.05 గంటలకు ఆంధ్రప్రదేశ్‌‌‌‌ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి విక్రమ్-1 రాకెట్ నారింజ రంగు మంటలు చిమ్ముతూ మేఘావృతమైన ఆకాశంలోకి దూసుకెళ్లింది. 

దీనితో భారత ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైంది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంతో అంతర్జాతీయ రాకెట్ లాంచ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి తొలిసారి భారత్‌‌‌‌‌‌‌‌ నుంచి ఒక ప్రైవేట్ కంపెనీ సగర్వంగా ఆగమనం చేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 11.30 గంటలకే రాకెట్ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా, నావిగేషన్ సమస్యల కారణంగా ముందే నిర్ణయించిన ప్రకారం అర గంట ఆలస్యంగా ప్రయోగించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.21 గంటలకల్లా రాకెట్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూ కక్ష్య(లో ఎర్త్ ఆర్బిట్)లోకి పేలోడ్‌‌‌‌‌‌‌‌లను విడిచిపెట్టింది. టెక్నాలజీ ప్రదర్శన పేలోడ్లతోపాటు ప్రధాని మోదీ సందేశంతో కూడిన పోస్ట్‌‌‌‌‌‌‌‌కార్డులను కూడా విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పటివరకూ ఉన్న ఆందోళన, ఉత్కంఠ.. ఒక్కసారిగా ఉత్సాహం, సంబరంగా మారిపోయాయి. తొలి పేలోడ్‌‌‌‌‌‌‌‌ను దాని కక్ష్యలోకి ప్రవేశపెట్టగానే.. లాంచ్ సైట్ వద్ద స్కైరూట్ టీమ్ సభ్యులు ‘హలో స్పేస్.. మేం వచ్చేశాం’ అని ప్రకటించారు. ఈ ప్రయోగంతో ఆర్బిటల్ మిషన్‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా స్కైరూట్ అవతరించింది.

వంద శాతం స్వదేశీ మిషన్.. 

మిషన్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇస్రో చీఫ్ వి. నారాయణన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఇస్రో మాజీ సైంటిస్టులు, స్కైరూట్ వ్యవస్థాపకులైన పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా ప్రయోగాన్ని వీక్షించారు. ఈ మిషన్‌‌‌‌‌‌‌‌ అనుకున్నది అనుకున్నట్టుగా పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా సాగిందని, అన్ని రకాలుగా విజయవంతం అయిందని స్కైరూట్ ఏరోస్పేస్ కోఫౌండర్, సీఈవో పవన్ కుమార్ చందన ప్రకటించారు. ఈ మిషన్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా భారతీయ బృందంతో, 100 శాతం భారతదేశంలోనే నిర్మించామని ఆయన చెప్పారు. ప్రైవేట్ రంగ లాంచ్ సామర్థ్యం కలిగిన దేశాల్లో అమెరికా, చైనా తర్వాత ఇప్పుడు భారత్‌‌‌‌‌‌‌‌ మూడో దేశమని నాగ భరత్ డాకా ప్రకటించారు. అంతర్జాతీయ ఆర్బిటల్ లాంచ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష రంగ ప్రవేశానికి సూచనగా ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్(రాక)’ అని పేరు పెట్టింది.

అంతరిక్ష రంగంలో మైలురాయి: ఇస్రో చీఫ్

స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ‘విక్రమ్-1’ రాకెట్ లాంచ్ విజయం దేశ అంతరిక్ష రంగంలో ఒక మైలురాయి అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ అన్నారు. శనివారం శ్రీహరికోటలో విక్రమ్-1 రాకెట్ లాంచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్రో మాజీ సైంటిస్టులైన పవన్ కుమార్, నాగభరత్ ఆధ్వర్యంలోని సంస్థ మొదటి ప్రయత్నంలోనే ఈ విజయాన్ని సాధించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ అద్భుత విజయం దేశీయ అంతరిక్ష రంగానికి ఎనలేని సంతృప్తిని ఇస్తుందని, ‘భారత్ 2047’ విజన్‌‌‌‌‌‌‌‌కు దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం ఏడు ప్రయోగాలను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు ఉపగ్రహాల నిర్మాణం పూర్తిగా పూర్తయిందని, మరో 5 నుంచి 6 ఉపగ్రహాల ఇంటిగ్రేషన్ తుది దశలో ఉందన్నారు.

విక్రమ్-1 ప్రత్యేకతలు ఇవే..

  •     దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ - క్లాస్ లాంచ్ వెహికల్. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట నామకరణం చేశారు.    350 కిలోల పేలోడ్లను 450 కి.మీ. ఎత్తులోని కక్ష్యకు, 260 కిలోల పేలోడ్‌‌‌‌‌‌‌‌లను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌‌‌‌‌‌‌‌లోకి చేర్చగలదు.  
  •     తేలికగా, అత్యంత బలంగా ఉండేందుకు రాకెట్ బాడీని అత్యాధునిక ఆల్-కార్బన్ కాంపోజిట్స్‌‌‌‌‌‌‌‌తో తయారు చేశారు.
  •     కనీస గ్రౌండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌తో, తక్కువ సమయంలోనే ఆన్-డిమాండ్ లాంచ్ సేవలను అందించేలా రూపొందించారు. దీనివల్ల కేవలం కొన్ని రోజుల్లోనే రాకెట్ అనుసంధానం, ప్రయోగానికి సిద్ధం చేయడం సాధ్యమవుతుంది.
  •     నిర్మాణ బరువు, తయారీ సంక్లిష్టతను తగ్గించడానికి అత్యాధునిక త్రీడీ-ప్రింటెడ్ ఇంజన్లను, మోడ్యులర్ ఏవియానిక్స్‌‌‌‌‌‌‌‌ను ఇందులో ఉపయోగించారు.
  •     20 మీటర్ల నుంచి 24 మీటర్లు (ఏడంతస్తుల భవనం అంత ఎత్తు).. 1.7 మీటర్ల వెడల్పు ఉంటుంది. 
  •     రాకెట్​కు 4 దశలు (3 సాలిడ్-ఫ్యూయల్ + 1 లిక్విడ్-ఫ్యూయల్ అప్పర్ స్టేజ్). వీటిలో మొదటి 3 దశల ఇంజన్‌‌‌‌‌‌‌‌లకు అబ్దుల్ కలాం పేరును, నాలుగో దశ ఇంజన్‌‌‌‌‌‌‌‌కు సర్ సీవీ రామన్ పేరును పెట్టారు.

విక్రమ్1 కక్ష్యలోకి చేర్చిన పేలోడ్‌‌‌‌‌‌‌‌లు, వస్తువులు ఇవే.. 

విక్రమ్ 1 రాకెట్ ప్రాథమిక పేలోడ్లు అయిన గ్రహా స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్, స్కైరూట్ సంస్థకు చెందిన స్కోప్ శాటిలైట్‌‌‌‌‌‌‌‌లను వరుసగా 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో స్కైరూట్ రూపొందించిన స్కోప్ శాటిలైట్ అనేది భవిష్యత్తు మిషన్లలో అంతరిక్ష సాంకేతికతలను పరీక్షించడా నికి అభివృద్ధి చేసిన అంతర్గత ప్రయోగాత్మక పేలోడ్. విక్రమ్-1 మోసుకెళ్లిన పేలోడ్లలో కాస్మోసర్వ్ స్పేస్ సంస్థకు చెందిన ‘ఎంబ్రేస్’ కూడా ఉంది. గ్రహా స్పేస్ అభివృద్ధి చేసిన సొలారస్ అనే చిన్న ఉపగ్రహం కూడా ఈ మిషన్‌‌‌‌‌‌‌‌లో అంతరిక్షానికి చేరింది. ఇక కాస్మోస్ డైమండ్స్ సంస్థకు చెందిన ‘ఆర్టిస్టిక్ ల్యాబ్-గ్రోన్ డైమండ్’ అయిన కాస్మిక్ బ్లూమ్, జర్మన్ టెస్ట్ పేలోడ్‌‌‌‌‌‌‌‌లు యూడీ3పీపీ, ఎండీ3ఆర్ఎన్‌‌‌‌‌‌‌‌ కూడా డీక్యూబ్డ్ ద్వారా అంతరిక్షానికి చేరాయి. వీటితోపాటు ఒక మైక్రో-ఆర్ట్ పేలోడ్, 18- క్యారెట్ల బంగారు రాకెట్ మోడల్, ప్రధాని మోదీ నుంచి  ‘వందేమాతరం’ సందేశం ఉన్న చేతితో రాసిన పోస్ట్‌‌‌‌‌‌‌‌కార్డుతోపాటు ఇంజనీర్లు, సైంటిస్టులు, భారతీయ వ్యోమగాముల నుంచి సేకరించిన పోస్ట్‌‌‌‌‌‌‌‌కార్డులను కూడా కక్ష్యలోకి విడిచిపెట్టింది.
.
యువతపై నా నమ్మకాన్ని నిజం చేశారు: మోదీ 

విక్రమ్1 రాకెట్ ప్రయోగం విజయవంతం కాగానే ప్రధాని నరేంద్ర మోదీ మిషన్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ చందనతో మాట్లాడారు. స్కైరూట్ బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘‘మీరు భారతదేశం గర్వపడేలా చేశారు” అని ప్రశంసించారు. ‘‘మీరు అంతరిక్షంలో భారతదేశ ఆకాంక్షలను నాటారు. యువత కలలకు మూలాలను (రూట్స్) ఇచ్చారు” అని కొనియాడారు. ‘‘మీ టీమ్ భారత యువతపై నాకున్న నమ్మకాన్ని నిజం చేసింది” అని ప్రధాని అన్నారు. అలాగే, “మీరు (ప్రధాని) పంపిన వందేమాతరం సందేశం ఇప్పుడు అంతరిక్షంలో ఉంది” అని పవన్ భావోద్వేగానికి లోనవుతూ చెప్పగా.. ప్రధాని ఈమేరకు స్పందించారు.